తెలంగాణ

telangana

ETV Bharat / business

రచ్చకెక్కిన కొనుగోళ్లు.. ఈ ఏడాది వార్తల్లో నిలిచిన విలీనాలివే.. - 2022 కంపెనీలు విలీనం

Top Mergers And Acquisitions : ఈ ఏడాదే ఎయిరిండియా టాటాల చేతికెళ్లింది. ప్రముఖ టీవీ ఛానెల్‌ ఎన్డీటీవీలో అదానీ ప్రధాన వాటాదారుగా నిలిచారు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్​ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అలా ఈ ఏడాది ప్రముఖంగా వార్తల్లో నిలిచిన కొనుగోళ్లు, విలీనాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

business acquisitions 2022
విలీన కంపెనీలు

By

Published : Dec 24, 2022, 3:23 PM IST

Top Mergers And Acquisitions : వ్యాపారం అంటే.. విలీనాలు, కొనుగోళ్లు సహజం. వ్యాపార రంగంలో ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు జరిగేవే. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇలాంటి వార్తలు పెద్దగా కనిపించనప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ప్రధాన కంపెనీల్లో విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి. వీటిలో కొన్నింటి ప్రక్రియ ఎలాంటి అవరోధాలూ లేకుండా సాఫీగా జరగ్గా.. మరికొన్ని మాత్రం వివాదాలతో వార్తల్లోకెక్కాయి. ఎయిరిండియా కొనుగోలు సాఫీగా పూర్తవ్వగా.. ట్విట్టర్​‌, ఎన్డీటీవీ వంటివి వార్తల్లో నిలిచాయి. అలా ఈ ఏడాది ప్రముఖంగా వార్తల్లో నిలిచిన కొనుగోళ్లు, విలీనాలేంటో చూద్దాం..

టాటాల చేతికి ఎయిరిండియా..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా అమ్మకం ప్రక్రియ కొన్నేళ్లుగా నానుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది టాటా గ్రూప్‌ వశమైంది. 1932 జేఆర్‌డీ టాటా స్థాపించిన టాటా ఎయిర్‌లైన్స్‌ తర్వాతి కాలంలో ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. అనంతరం ఎయిరిండియాగా మారింది. నష్టాల్లో ఉన్న ఈ విమాన సంస్థను ప్రభుత్వం విక్రయించడం వల్ల సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ టాటా గ్రూప్‌ చేతుల్లోకి వచ్చింది. రూ.18వేల కోట్లకు కొనుగోలు చేయడం వల్ల ఈ ఏడాది జనవరిలో టాటాలకు ఎయిరిండియాను ప్రభుత్వం అధికారికంగా అప్పగించింది.

మస్క్‌ చేతికి ట్విట్టర్..
ఈ ఏడాది కొనుగోళ్ల విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది ఏదైనా ఉందీ అంటే అది ట్విట్టర్ మాత్రమే. అంతగా మలుపులు తిరిగింది ఈ కొనుగోలు వ్యవహారం. 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తానని తొలుత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడం.. ఆ తర్వాత కొనబోనని చెప్పడం.. దీంతో ఈ వ్యవహారం మళ్లీ కోర్టుదాకా వెళ్లడం మనం చూశాం. నాటకీయంగా సాగిన అనేక పరిణామాల తర్వాత చివరికి మళ్లీ మస్కే ట్విట్టర్​ను కొనుగోలు చేశారు. ట్విట్టర్ పిట్టను చేజిక్కించుకున్నాక.. సంస్థ బోర్డు మెంబర్లు సహా దాదాపు సగం మంది ఉద్యోగుల్ని మస్క్‌ వెళ్లగొట్టారు. కొందరేమో స్వయంగా రాజీనామా సమర్పించారు. ట్విట్టర్ 'ఫ్రీ స్పీచ్‌'కు వేదికగా మారుస్తానంటూ చెప్పిన మస్క్‌.. ఇప్పుడు ట్విట్టర్​లో పూటకో మార్పు చేస్తున్నారు.

ఎన్డీటీవీ వ్యవహారం..
ఒక మీడియా సంస్థను దేశంలో అత్యంత సంపన్నుడైన ఓ వ్యక్తి చేజిక్కించుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఇక్కడ ఎన్డీటీవీని అదానీ చేజిక్కించుకున్న విధానం ఆసక్తిగా మారింది. ఎప్పుడో తీసుకున్న రుణాన్ని వాటాలుగా మార్చుకోవడం ద్వారా ఎన్డీటీవీలో వాటాలు పొందారు గౌతమ్‌ అదానీ. ఆ తర్వాత ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరిన్ని షేర్లు కొనుగోలు చేసి ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా నిలిచారు. ఎన్డీటీవీ సీనియర్‌ జర్నలిస్టు రవీశ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేయగా.. ఎన్డీటీవీ వ్యవస్థాపకులైన రాధికా, ప్రణయ్‌ రాయ్‌ తమ బోర్డు పదవుల నుంచి వైదొలిగారు. తాజాగా తమ మెజారిటీ షేర్లనూ అదానీ గ్రూప్‌నకు విక్రయిస్తామని ప్రకటించారు.

పీవీఆర్‌-ఐనాక్స్‌ విలీనం..
దేశంలోనే రెండు అతిపెద్ద మల్టీప్లెక్స్‌ సంస్థలైన పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ సైతం ఈ ఏడాదే విలీనం అయ్యాయి. దీంతో పీవీఆర్ ఐనాక్స్‌ అనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ సంస్థ అవతరించింది. విలీన సంస్థకు దేశవ్యాప్తంగా 1,500 స్క్రీన్లు ఉన్నాయి. కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గడం.. ఓటీటీ వేదికల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ నేపథ్యంలో ఈ విలీనం జరగడం గమనార్హం.

హెచ్‌డీఎఫ్‌సీ- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
దేశ కార్పొరేట్‌ చరిత్రలో మరో కీలక విలీనం జరిగింది. మోర్టగేజ్‌ రుణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌.. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ విలీనం అయ్యాయి. దీనికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలయిన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ విలీనం కానున్నాయి. ఈ ప్రక్రియ 2023 రెండో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉంది.

అదానీ గ్రూప్‌ చేతికి అంబుజా-ఏసీసీ..
అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ ఏడాది వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు. తన వ్యాపార పరిధిని విస్తరించుకుంటూ వెళ్లారు. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్‌, ఏసీసీలో మెజారిటీ వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్‌ రంగంలోకీ అడుగుపెట్టారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా అదానీ గ్రూప్‌ను నిలిపారు.

రిలయన్స్‌ చేతికి మెట్రో ఇండియా..
దేశీయంగా తన రిటైల్‌ రంగ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత టోకు వ్యాపార కార్యకలాపాలను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియాలో 100 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌), కచ్చితంగా అమలయ్యే వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం రూ.2,850 కోట్ల నగదు చెల్లించనుంది. తుది సర్దుబాటును అనుసరించి ఈ విలువ కాస్త మారొచ్చని ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. 2023 మార్చి కల్లా ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఐటీలోనూ ఓ విలీనం..
తమ నియంత్రణలోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలైన మైండ్‌ ట్రీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌లను విలీనం చేస్తున్నట్లు లార్సెన్‌ అండ్‌ టుబ్రో ఈ ఏడాదే ప్రకటించింది. కొత్త సంస్థను ఎల్‌టీఐమైండ్‌ట్రీగా వ్యవహరిస్తున్నారు. విలీనం తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సంస్థగా ఈ సంస్థ అవతరించింది.

  • ప్రముఖ ఆహార పదార్థాల సరఫరా సంస్థ జొమాటో ఈ ఏడాదే క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ను రూ.4,447 కోట్లతో కొనుగోలు చేసింది.
  • టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత దేశీయంగా ఆవిర్భవించిన మోజ్‌, ఎంఎక్స్‌ టకాటక్‌ ఈ ఏడాదే విలీనం అయ్యాయి. 300 మిలియన్ల మంత్లీ యాక్టివ్‌ యూజర్లతో అతిపెద్ద షార్ట్‌వీడియో షేరింగ్‌ యాప్‌గా అవతరించింది.

ABOUT THE AUTHOR

...view details