2022.. ఎంతో 'భారాన్ని' మన మీద మోపి కనుమరుగవుతోంది.పెట్రోలు ధర సెంచరీ కొట్టింది.. వంటనూనె డబుల్ సెంచరీ కొట్టినా మళ్లీ వెనక్కి వచ్చింది. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ప్రియమయ్యాయి. ఆర్‌బీఐ వరుస వడ్డింపుతో.. నెలవారీ వాయిదాలు మోత మోగుతున్నాయి రూపాయి క్షీణతతో.. విదేశీ చదువులు, ప్రయాణాలు భారమయ్యాయి. స్టాక్ మార్కెట్‌లు సరికొత్త గరిష్ఠాలకు చేరడం.. డిపాజిట్ రేట్లు పెరగడం కొంతలో కొంత ఊరట.. ఆర్థిక వ్యవస్థ ప్రదర్శన మెరుగ్గానే ఉన్నా.. విదేశీ మారకపు నిల్వలు కరిగిపోవడం ఆందోళనకరమే. 5జీ సేవల ప్రారంభం ఉత్సాహాన్ని నింపితే.. అధీకృత డిజిటల్ రూపాయి.. విదేశీయులనూ ఆకర్షించింది. మదుపర్ల నిరీక్షణకు తెరదించుతూ..
ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్ గడప తొక్కింది. ఎయిరిండియా.. మళ్లీ సొంత గూటికి చేరగా.. దేశీయులూ అమితాసక్తి చూపే ట్విటర్ పక్షి.. మస్క్ చేతికి చిక్కింది.. ఆసియాలోనే అత్యంత శ్రీమంతుడు.. ప్రపంచ కుబేరుల్లో మూడోస్థాన హోదాలు అదానీకి దక్కాయి. పరిశ్రమ దిగ్గజాలకు తోడు మార్కెట్ మాంత్రికుడు ఝున్‌ఝున్‌వాలా మరణం విషాదాన్ని నింపింది.. ఇలా పలు పరిణామాలకు వేదికయ్యింది 2022..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూ నిరీక్షణకు ఈ ఏడాదే తెరపడింది. పబ్లిక్ ఇష్యూకు 2.95 రెట్లు స్పందన లభించింది. ఈ ఐపీఓ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.20,557 కోట్లు సమకూరాయి. అయితే స్టాక్ మార్కెట్లో నమోదైన తొలి రోజే ఎల్‌ఐసీ షేరు డీలాపడింది. ఇప్పటకీ ఇష్యూ ధర కంటే 28% తక్కువగా ప్రస్తుతం రూ.684.60 వద్ద ఉంది.
ఆసియాలోనే అత్యంత శ్రీమంతుడిగా అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ అవతరించారు. ప్రపంచంలోని అత్యంత శ్రీమంతుల్లోనూ మూడో స్థానానికి ఎగబాకారు. రెండేళ్లుగా అదానీ గ్రూపు కంపెనీల షేర్లు దూకుడును కనబరుస్తుండటం, పలు వ్యాపార విభాగాల్లోకి అడుగుపెట్టడం ఇందుకు దోహదం చేసింది. ఈ ఏడాది ఏసీసీ, అంబుజా సిమెంట్స్, ఎన్‌డీటీవీని అదానీ సొంతం చేసుకున్నారు.
యుద్ధంతో మిశ్రమ ప్రభావాలు
ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చిక్కులు తెచ్చి పెట్టింది. అమెరికా, బ్రిటన్‌లు రష్యాపై ఆంక్షలు విధించడంతో, మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని భయాలూ నెలకొన్నాయి. రష్యా నుంచి ముడి చమురు; ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు పవ్వు నూనె, గోధుమల కోసం చాలా దేశాలు ఆధారపడి ఉండటమే ఇందుకు కారణం. సరఫరాలకు అవరోధాలు ఏర్పడి, ముడి చమురు, వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. మనదేశానికి కూడా ఈ సెగ తాకినా, ప్రభుత్వ చర్యలతో ఆ ప్రభావం కాస్త సర్దుమణిగింది. రష్యా నుంచి చౌక ధరకే ముడి చమురును దిగుమతి చేసుకుని మనదేశం ప్రయోజనం పొందింది. రూపాయల్లో విదేశీ వాణిజ్య చెల్లింపుల దిశగా భారత్ అడుగులు వేసేందుకూ ఓ విధంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధమే కారణమైంది.
ఆర్‌బీఐ వడ్డింపు
అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇప్పటికి 5 విడతలలో కీలక రేట్లను పెంచింది. దీంతో రుణగ్రహీతల నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) భారమయ్యాయి. కొవిడ్-19 పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు రెపో రేటును 4 శాతం వద్దే ఆర్‌బీఐ కొనసాగింది. అమెరికా ఫెడరల్‌తో పాటు ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల తరహాలోనే వడ్డీరేట్ల పెంపునకు ఈ ఏడాది మేలో శ్రీకారం చుట్టింది. తొలుత 0.40%, ఆ వరుసగా మూడు సార్లు 0.50%, ఈనె 7న 0.35% చొప్పున పెంచింది. దీంతో మొత్తంగా రెపో రేటు 2.25 శాతం పెరిగి... 6.25 శాతానికి చేరింది. ఇందువల్ల బ్యాంకులు డిపాజిట్ రేట్లనూ పెంచాయి.
బక్కచిక్కిన రూపాయి
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మునుపెన్నడూ లేనివిధంగా క్షీణించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలరుకు గిరాకీ పెరిగి, ఈ ఏడాది తొలిసారిగా రూ.80ని మించింది. ఈ ఏడాది ప్రారంభంలో డాలరు మారకపు విలువ రూ.74 కాగా.. సంవత్సరాంతానికి రూ.82.85కు చేరింది. ఏడాదికాలంలో రూపాయి విలువ 11 శాతం పతనమైంది. రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు నివారించేందుకు డాలర్లను ఆర్‌బీఐ విక్రయించడంతో, దేశ విదేశీ మారకపు నిల్వలు కూడా తగ్గిపోయాయి. ఇందువల్ల దిగుమతులు భారమవ్వడమే కాకుండా, విదేశాల్లో చదువులు, ప్రయాణాలు మరింత వ్యయభరితంగా మారాయి. ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి క్షీణత తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
దిగ్గజాల కన్నుమూత
కార్పొరేట్ పరిశ్రమ ఈ ఏడాది ప్రముఖుల్ని కోల్పోయింది. టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. టాటాల ఇంటిపేరు లేకుండా టాటా గ్రూపు బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా ఆయన అప్పట్లో ఘనత సాధించారు. కోట్ల మంది భారతీయులు ‘హమారా బజాజ్’ అనుకునేలా ద్విచక్ర వాహనాలు రూపొందించిన బజాజ్ గ్రూపు మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్, టయోటాను భారత్‌కు తీసుకొచ్చిన విక్రమ్ కిర్లోస్కర్, సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసి తంతి ఈ ఏడాదే మరణించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కూడా కన్నుమూశారు.
ఎయిరిండియా.. మళ్లీ మహారాజా
ఏళ్ల తరబడి ప్రభుత్వరంగంలో సతమతమైన ఎయిరిండియా ఎట్టకేలకు మళ్లీ ఈ ఏడాది జనవరిలోనే పుట్టిల్లయిన టాటా గ్రూపు వశమైంది. ఎయిరిండియాకు తిరిగి మహారాజా దర్పాన్ని తీసుకు రావాలన్న లక్ష్యంతో టాటాలు పనిచేస్తున్నారు. ప్రస్తుత విమానాలను ఆధునికీకరించడంతో పాటు సేవల్లో నాణ్యత పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే టాటాల చేతిలో ఉన్న విస్తారా, ఎయిరేషియా ఇండియాలను ఎయిరిండియా గొడుకు కిందకు తీసుకు వచ్చి, ప్రపంచస్థాయి దిగ్గజ విమానయాన సంస్థల సరసన ఎయిరిండియాను నిలబెట్టే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
5జీ.. వచ్చేసిందోచ్
4జీతో పోలిస్తే 10 రెట్ల వేగం, అంతరాయం లేని అనుసంధానం, రియల్ టైంలో కోట్ల కొద్దీ కనెక్టెడ్ పరికరాల మధ్య డేటా బదిలీకి వీలు కల్పించే 5జీ సేవలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. కొన్ని సర్కిళ్లలోనే ఇవి మొదలు కాగా.. దేశమంతా అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన 5జీ వేలానికి రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రూ.88,078 కోట్లతో దేశంలోని అన్ని 22 సర్కిళ్లలో 5జీ స్పెక్ట్రమ్‌ను జియో కొనుగోలు చేసింది. భారతీ ఎయిర్‌టెల్ వివిధ బ్యాండ్‌లలో(700 మెగాహెర్ట్జ్ మినహా) 19,867 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లతో, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన 6228 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. అదానీ కూడా కొంత స్పెక్ట్రమ్ కొనుగోలు చేశారు.
ఆ నలుగురికి ‘పద్మ’ పురస్కారాలు
ఈ ఏడాది నలుగురు కార్పొరేట్ ప్రముఖులకు పద్మ భూషణ్ పురస్కారాలు దక్కాయి. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలాకు భారత ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. వీరిలో సుందర్ పిచాయ్‌కు అమెరికాలో ఈ పురస్కారాన్ని అందించారు.