కేంద్ర బడ్జెట్ ప్రభావం ప్రతి పౌరుడిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేయాలనే ఒక స్థూల సిద్ధాంతం ఆధారంగా బడ్జెట్‌ను రూపొందిస్తారు. మన ఇంటి పద్దు విషయంలోనూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
అవగాహనతో..
కుటుంబ బడ్జెట్ తయారు చేసే ముందు మీ ఆర్థిక లక్ష్యాలేమిటి? అవసరాలేమిటి? స్పష్టంగా తెలుసుకోండి. వాటిని ఒక దగ్గర రాయండి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను విడివిడిగా పేర్కొనండి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనడం స్వల్పకాలిక అవసరం. సొంతిల్లు, కారు కొనాలనుకోవడం మధ్య కాలిక లక్ష్యాలు. పదవీ విరమణ, పిల్లల వివాహం దీర్ఘకాలిక వ్యూహాలు. ఒకసారిపై వీటిపై స్పష్టత వస్తేనే మీరు ఏం చేయాలన్న విషయం అర్థం అవుతుంది. చాలామందికి ఆర్థిక ఇబ్బందులు రావడానికి ప్రధాన కారణం.. సంపాదించిన డబ్బును ఎలా సర్దుబాటు చేయాలన్నది తెలియకపోవడమే. లక్ష్యం సూటిగా ఉంటే దానికి ప్రణాళిక వేయడం సులభం. లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మన దగ్గరున్న ఆర్థిక వనరులను ఎంత సమర్థంగా వినియోగించుకోవాలో తెలుసుకునేందుకు మీ ఇంటి బడ్జెట్ ఉపయోగపడుతుంది.
నెలకు కొంత మొత్తాన్ని తీసి పొదుపు చేస్తే చాలు.. అదే ఆర్థిక ప్రణాళిక అనుకుంటారు చాలామంది. వాస్తవంలో ఇది పొరపాటు. మీరు ఎంత దాస్తున్నారు అని కాకుండా.. మీ లక్ష్యం వాస్తవ రూపంలోకి రావాలంటే ఎంత మదుపు చేయాలి అని తెలుసుకొని, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేలా ప్రణాళిక ఉండాలి.
అత్యవసర నిధి ఉందా?
ఎప్పుడు ఏ కష్టం వస్తుందో చెప్పలేం. అందుకే, ప్రతి ఒక్కరి దగ్గరా కొంత అత్యవసర నిధి తప్పనిసరిగా ఉండాలి. మీ కుటుంబ బడ్జెట్‌లో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. కనీసం 6 నెలల ఖర్చులు, వాయిదాలకు సరిపోయే మొత్తం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోండి.
లెక్క ఉండాల్సిందే..
మీరు లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత చేయాల్సిన పని.. మీకు వచ్చే ప్రతి రూపాయినీ లెక్కించడం. ఆదాయం ఎలా వస్తోంది? ఖర్చుల కోసం ఎంత వెళ్తుంది అన్నదానికి కచ్చితమైన లెక్క ఉండాలి. మీకు వచ్చే వేతనం, ఇతర ఆదాయాలు, వడ్డీ, పెట్టుబడులపై రాబడి ఇలా అన్ని ఆదాయాలనూ కలపండి. ఏడాదికి ఎంత ఆదాయం వస్తుందనేది అంచనా వేయండి. నెలవారీ ఖర్చు ఎంత అవుతోంది.. మూడు, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి వచ్చే పెద్ద ఖర్చులు, శుభకార్యాలు ఇలా అన్నింటికీ తగిన కేటాయింపులు ఉండాలి. ఇలాంటి ఖర్చులకూ నెలకు కొంత మొత్తాన్ని తీసి, రికరింగ్ డిపాజిట్లలాంటి వాటిలో జమ చేయాలి.
- కుటుంబ సభ్యులు చేసే ప్రతి ఖర్చునూ లెక్క రాయాలి. వాటిని ప్రతి రెండు నెలకోసారి సమీక్షించుకోవాలి. ఖర్చుల నియంత్రణ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి.
- స్థిరమైన ఆదాయం లేని వారు ఆదాయం, ఖర్చుల కోసం రెండు వేర్వేరు ఖాతాలు నిర్వహించాలి. ఆదాయాలన్నీ ఒక చోట జమ చేసి, ఆ తర్వాత ఖర్చుల ఖాతాలోకి కొంత మొత్తం మళ్లించాలి.