ఖరీదైన టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు ఒకేసారి మొత్తం ధరను చెల్లించక్కర్లేకుండా వాయిదాల పద్ధతిని ఎంచుకోవచ్చు. డబ్బు చేతిలో లేనప్పుడు ఇది ఎంతో అనుకూలమైన అంశమే.
వదులుకుంటేనే..
ఒకేసారి మొత్తం డబ్బును చెల్లించినప్పుడు కొన్ని రాయితీలు ఉంటాయి. ఉదాహరణకు రూ.5,000 వస్తువును 10 శాతం రాయితీతో రూ.4,500లకు సొంతం చేసుకోవచ్చు. సున్నా వడ్డీ వాయిదాలో కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ రాయితీ అందదు. అంటే, తగ్గింపును వదులుకోవాలన్నమాట.
మరో సందర్భంలో ఉత్పత్తి ధర రూ.5,000 అనుకుందాం. నెలకు రూ.500 చొప్పున 12 నెలల పాటు చెల్లించాల్సి రావచ్చు. అంటే అదనంగా 20 శాతం, రూ.1,000. అప్పుడు ఆ వస్తువు ధర రూ.6,000 అవుతుంది. సాధారణంగా సున్నా వడ్డీ అని చెప్పినా.. రాయితీలు ఇవ్వకపోవడం లేదా ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో ఆ మేరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటారన్నమాట. సాధారణ ఈఎంఐని ఎంచుకున్నప్పుడు వడ్డీ భాగాన్ని విడిగా చూపిస్తుంటారు. కానీ, నో కాస్ట్ ఈఎంఐలో ఇలా ప్రత్యేకంగా వడ్డీ ఉండదు.
ఎప్పుడు ఎంచుకోవాలి..
ఖరీదైన ఉత్పత్తిని కొనాలనుకొని, ఒకేసారి ఆ మొత్తం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నోకాస్ట్ ఈఎంఐను ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు వ్యాపారులు, ఇ-కామర్స్ సంస్థలు ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేక రాయితీలతోపాటు, ఈఎంఐ వెసులుబాటు కల్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనూ ఈ వెసులుబాటును వాడుకోవచ్చు.