Mutual Funds Investment: స్టాక్ మార్కెట్ అంటేనే అస్థిరత. హెచ్చుతగ్గులు ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. కొత్త మదుపరులు ఇప్పటికే తమ పెట్టుబడి విలువలో 10 శాతానికి పైగా క్షీణత చూశారు. స్వల్పకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈ అస్థిరతే ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి సహాయం చేస్తుంది.
అర్థం చేసుకుంటూ..:సూచీల్లో ఎప్పుడూ దిద్దుబాటు వస్తూనే ఉంటుంది. ఇది 2-5 శాతం వరకూ ఉన్నప్పుడు సాధారణ విషయమే. 10 శాతానికి మించినప్పుడు పెట్టుబడి వ్యూహాలను రచించుకోవాలి. పతనం తర్వాత మార్కెట్ బలంగా ముందుకెళ్లిన సందర్భాలు ఎన్నో చూశాం. చరిత్ర సంగతి ఎలా ఉన్నా.. కొవిడ్-19 తరువాత పరిస్థితులు మనకు స్పష్టంగా తెలుసు కదా.. భయాందోళనలతో పెట్టుబడిని వెనక్కి తీసుకున్న వారు మార్కెట్ వృద్ధి చెందినప్పుడు వచ్చిన ఫలితాలను అందుకోలేకపోయారు. తక్కువ విలువతో అందుబాటులోకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వారు అధిక రాబడులను అందుకున్నారు.
ఈక్విటీల్లో..:షేర్లలో పెట్టుబడి అంటే.. నష్టభయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లే. కానీ, దీర్ఘకాలంలో ఇది అంతగా ఉండదు. పైగా అధిక రాబడికీ అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో పెట్టుబడిని 3-5 ఏళ్లపాటు వెనక్కి తీసుకోకూడదు. ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్నదీ ప్రధానమే. 40 ఏళ్ల వ్యక్తి తన పెట్టుబడి మొత్తంలో 70 శాతం వరకూ ఈక్విటీ ఫండ్లకు కేటాయించవచ్చు. 40-55 ఏళ్ల వారు 30-60 శాతం, 55 ఏళ్లపైబడిన వారు 30 శాతంలోపే ఈక్విటీ పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి.