తెలంగాణ

telangana

ETV Bharat / business

డిజిటల్‌ లోన్​ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - డిజిటల్ రుణాలు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు

చిన్న అవసరం వచ్చినా అప్పు చేయడం ఇప్పుడు సాధారణమైంది. రుణం తీసుకునే వారిని ప్రోత్సహిస్తూ ఎన్నో కొత్త సంస్థలు, డిజిటల్‌ లోన్‌ యాప్‌లు వచ్చాయి. వస్తున్నాయి. అడగడమే ఆలస్యం క్షణాల్లో డబ్బును ఖాతాలో జమ చేస్తున్నాయి. కొన్నిసార్లు రుణం కావాలా? అంటూ బతిమాలి మరీ ఇస్తున్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి రుణగ్రహీతలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఎంతోమంది వీటి బారిన పడి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అవసరానికి అప్పు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకుందాం.

digital loan
డిజిటల్‌ లోన్​ తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

By

Published : Oct 14, 2022, 10:20 AM IST

కొవిడ్‌ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. చాలామందికి ఆర్థిక అవసరాలు ఉన్నట్లుండి పెరిగాయి. ఎంతోమంది తమ ఆర్జన శక్తిని కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని, అనధికారికంగా అప్పులిచ్చే యాప్‌లు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. రూ.3వేల నుంచి రూ.3లక్షల వరకూ రుణాలిస్తున్న ఈ సంస్థలు అప్పు వసూలు విషయంలోనూ, అధిక వడ్డీని వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

గుర్తింపు ఉందా?
మన దేశంలో అప్పులు ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆర్‌బీఐ గుర్తింపు పొంది ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థతో కలిసి పనిచేస్తుండాలి. ఇలా గుర్తింపు పొందని సంస్థలు అప్పులు ఇవ్వడానికి వీల్లేదు. డిజిటల్‌ రుణాలు తీసుకునేటప్పుడు ముందుగా ఆ సంస్థ, యాప్‌ ఆర్‌బీఐ గుర్తింపు పొందిందా లేదా అనేది చూసుకోండి. ధ్రువీకరణ సంఖ్య తదితరాలను రిజర్వు బ్యాంకు వెబ్‌సైటులో తనిఖీ చేసుకోవాలి. మనం రుణం తీసుకునేటప్పుడు ఆయా సంస్థలు మన పూర్తి వివరాలను (కేవైసీ) తీసుకుంటాయి. అలాగే, మనమూ రుణ సంస్థ గురించి ఆరా తీయాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

సందేశాలు నమ్మొద్దు..
క్రెడిట్‌ స్కోరుతో అవసరం లేదు. ఆదాయ ధ్రువీకరణలు అక్కర్లేదు అంటూ రుణ యాప్‌లు సందేశాలు పంపిస్తుంటాయి. ఇలాంటివి సాధారణంగా మోసపూరిత యాప్‌లే అయి ఉంటాయి. మీ కీలకమైన వ్యక్తిగత, చిరునామా, ఇతర ధ్రువీకరణలను దొంగిలించి వాటిని మోసపూరితంగా ఉపయోగించుకుంటాయి. అందుకే, అడిగినవారికల్లా మీ సమాచారాన్ని ఇవ్వొద్దు.

కొన్నిసార్లు రుణ సంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెబుతూ.. మీ బ్యాంకు ఖాతా నెంబరు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలను అడుగుతుంటారు. కార్డు గడువు తేదీ, పిన్‌, ఓటీపీలను చెప్పాలని, అప్పడే రుణం మీ ఖాతాలోకి జమ అవుతాయంటారు. ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దు. రుణం మాట తర్వాత.. ఉన్న డబ్బునూ ఊడ్చేస్తారు. తస్మాత్‌ జాగ్రత్త.

ఒప్పందాన్ని చూసుకోండి..
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. రుణం ఇచ్చే సంస్థ తన నిబంధనలన్నీ ముందుగా రుణగ్రహీతకు తెలియజేయాలి. మోసపూరిత యాప్‌లు, సంస్థలకు ఇలాంటి నిబంధనలేమీ రాతపూర్వకంగా ఉండవు. ఇలా స్థిరమైన ఒప్పంద పత్రం లేనప్పుడు ఆయా సంస్థలు రుణగ్రహీత నుంచి అధిక వడ్డీతోపాటు, వాయిదాలనూ ఇష్టం వచ్చినట్లు వసూలు చేసే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే, రుణం తీసుకోబోయే ముందు తప్పనిసరిగా అగ్రిమెంట్‌ను చూపించాలని చెప్పండి. దీంతోపాటు, పరిశీలనా రుసుము, వడ్డీ రేటు, చెల్లింపు వ్యవధి, ఆలస్యంగా చెల్లిస్తే విధించే జరిమానాలాంటివన్నీ పరిశీలించాలి. ఆయా సంస్థల వెబ్‌సైట్లలో ఈ వివరాలన్నీ ఉన్నాయా చూడండి.
డిజిటల్‌ లోన్‌లను అందిస్తున్న సంస్థ చిరునామా, ఏ బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చుకుంది అనే వివరాలనూ పరిశీలించాలి.

ఇవి గుర్తుంచుకోండి..

  • డిజిటల్‌ రుణాలను యాప్‌ల ద్వారా ఇస్తున్నప్పటికీ.. వాటికి కచ్చితంగా ఒక వెబ్‌సైట్‌ చిరునామా ఉంటుంది. అలా వెబ్‌సైట్‌ లేదంటే అది మోసపూరిత సంస్థ.
  • ఆర్‌బీఐ నిబంధనల మేరకు రుణం ఇచ్చే సంస్థ ‘మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ)’ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వీటి గురించి పట్టించుకోవడం లేదంటే అనుమానించాల్సిందే.
  • క్రెడిట్‌ స్కోరుతో అవసరం లేదు అని చెబుతూ.. మాకు అప్పు వద్దు అంటున్నా పదే పదే ఫోన్లు చేసి, రుణం ఇస్తామని అంటే ఆ సంస్థలు, యాప్‌లను నమ్మొద్దు.
  • రుణం మంజూరు చేయడం కన్నా ముందే పరిశీలనా రుసుము, ఇతర ఛార్జీలు చెల్లించకూడదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ మొత్తంలో నుంచే ఆయా రుసుములు మినహాయించుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details