తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహన బీమా తీసుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి - మోటరు వాహన చట్టం

Vehicle Insurance:మన దేశంలోని రోడ్లపై వాహనాలు నడిపించాలంటే.. కచ్చితంగా బీమా ఉండాలి. అయితే ఇన్సూరెన్స్‌ ఎంపికలో కొన్ని కీలక సూచనలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది కొన్ని కారణాల వల్ల థర్డ్ పార్టీ బీమాను తీసుకుంటూ ఉంటారు. అయితే, థర్డ్ పార్టీ బీమా ద్వారా 100 శాతం కవరేజ్‌ను పొందలేరు. కాబట్టి వాహన బీమా తీసుకునేటప్పుడు వినియోగదారులు పరిశీలించాల్సిన కొన్ని యాడ్​ ఆన్​ల గురించి తెలుసుకుందాం.

vehicle insurance
vehicle insurance

By

Published : Apr 14, 2022, 2:16 PM IST

Vehicle Insurance: మోటారు వాహన చట్టం 1988 ప్రకారం, రోడ్లపై ఎలాంటి వాహనాన్ని నడపాలన్నా, ఆ వాహనానికి కచ్చితంగా మోటారు బీమా ఉండాలి. కానీ, కొంత మంది వినియోగదారులు వాహన బీమా ప్రీమియం ఎక్కువగా ఉందనో లేదా ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికో కేవలం థర్డ్ పార్టీ బీమాను తీసుకుంటూ ఉంటారు. అయితే, థర్డ్ పార్టీ బీమా ద్వారా మీరు 100 శాతం కవరేజ్‌ను పొందలేరు. అలాగే, మీరు ఒక సమగ్ర బీమా కవరేజ్ పాలసీని తీసుకున్నప్పటికీ, అది అన్ని రకాల నష్టాలకు పూర్తి కవరేజ్‌ను అందించదు. అందువల్ల వినియోగదారులు పూర్తి కవరేజ్‌ను పొందడానికి యాడ్-ఆన్ కవర్‌ను తీసుకోవడం మంచిది. కాబట్టి వాహన బీమా తీసుకునే సమయంలో వినియోగదారులు పరిశీలించాల్సిన కొన్ని రకాల యాడ్ ఆన్‌లను దిగువ తెలియజేశాం. ఇవి మీ వాహన బీమాకు పూర్తి కవరేజ్‌ను అందిస్తాయి.

  • ఎమర్జెన్సీ రోడ్ సైడ్ అసిస్టెన్స్..ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోకుండా మీ వాహనానికి ఏదైనా సమస్య తలెత్తితే, అలాంటి సమయంలో ఈ యాడ్-ఆన్ కవర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యాడ్-ఆన్ ద్వారా ఇంధనం అయిపోయి ఆగిపోయిన వాహనానికి ఇంధనాన్ని నింపడం, పంక్చర్ అయిన టైర్‌ను మార్చడం, ప్రమాదానికి గురైన వాహనాన్ని సర్వీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, వాహనాన్ని రిపేర్ చేయడం వంటి సేవలను బీమా సంస్థ అందిస్తుంది. అలాగే, ప్రమాదవశాత్తు కారు బ్రేక్ డౌన్ అయిన సందర్భాల్లో కూడా ఈ కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్..ఒకవేళ మీరు ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతంలో నివసిస్తున్నట్లైతే, మీరు ఈ యాడ్-ఆన్ కవర్‌ను తీసుకోవడం మంచిది. వాహన ఇంజిన్ పూర్తిగా నీటిలో ఉండడం వల్ల ఇంజిన్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కలిగే నష్టాన్ని ఈ యాడ్-ఆన్ కవర్ పూరిస్తుంది. అలాగే, ఇది ఆయిల్ లీకేజ్, గేర్ బాక్స్ డామేజ్ వంటి వాటిని కవర్ చేస్తుంది.
  • కన్సూమబుల్స్ కాస్ట్.. ఒకవేళ మీ వాహనం ప్రమాదానికి గురైతే, దానిని రిపేరు చేసే సమయంలో వినియోగించే నట్లు, బోల్టులు, ఇంజిన్ ఆయిల్, బేరింగ్స్ వంటి వినియోగ వస్తువుల ధరను బీమా సంస్థలు మినహాయిస్తాయి. ఒకవేళ మీరు ఈ యాడ్-ఆన్‌ను తీసుకున్నట్లైతే వాటిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • జీరో డిప్రిసియేషన్ కవర్..ఈ యాడ్-ఆన్‌ను కొత్త కార్ల కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు. దీన్ని 'నిల్ డిప్రిసియేషన్' లేదా 'బంపర్ టు బంపర్' అని కూడా పిలుస్తారు. ఇది పాలసీదారుడికి నష్టాల వ్యయాన్ని తగ్గించి పూర్తి కవరేజ్‌ను అందిస్తుంది. ఇది సాధారణ బీమా ప్రీమియం కంటే 15 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ యాడ్- ఆన్ తీసుకోకపోతే ప్లాస్టిక్, రబ్బర్, ఫైబర్, మెటల్, పెయింట్ వంటి వాటికి అయ్యే ఖర్చును పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది.
  • నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ప్రొటెక్షన్ కవర్..ఒకవేళ వాహన యజమాని బీమా క్లెయిమ్ చేసినట్లయితే, పాలసీ పునరుద్ధరణ సమయంలో నో క్లెయిమ్ బోనస్‌ను పొందలేరు. తద్వారా ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్ సహాయపడుతుంది. ఇందులో గరిష్ఠంగా 50 శాతంగా వరకు మినహాయింపు పొందొచ్చు.
  • పర్సనల్ బిలాంగింగ్స్ కవరేజ్..ప్రస్తుత రోజుల్లో చాలా మంది ల్యాప్‌టాప్‌, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి ఖరీదైన వస్తువులను తీసుకుని కారులో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ కారు ప్రమాదానికి గురైతే, అందులోని వస్తువులకు నష్టం వాటిల్లడం లేదా దొంగతనానికి గురవ్వడం జరుగుతుంది. ఈ ఖరీదైన వస్తువులకు జరిగే నష్టాన్ని సాధారణ వాహన బీమా పాలసీ కవర్ చేయదు. ఒకవేళ మీకు 'పర్సనల్ బిలాంగింగ్స్ (వ్యక్తిగత వస్తువుల) కవరేజ్' యాడ్-ఆన్ తీసుకున్నట్లైతే, మీ దెబ్బతిన్న వస్తువులకు, అలాగే దొంగతనానికి గురైన వస్తువులకు కూడా కవరేజ్ లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details