high inflation: అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక, అభివృద్ధి చెందిన - చెందుతున్న దేశాలనే తారతమ్యం లేదు. ఏ దేశంలో చూసినా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. చైనా, జపాన్, సౌదీ అరేబియా..వంటి కొన్ని దేశాలే ఇందుకు మినహాయింపు. మిగతా దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ సమయంలో వ్యవస్థలోకి విడుదల చేసిన అధిక ద్రవ్యాన్ని ఉపసంహరిస్తూ, వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణ సమస్య అంటే ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడమే. ఖర్చులు భరించలేక అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అభివృద్ధి చెందిన 44 దేశాలను పరిశీలిస్తే అందులోని 37 దేశాల్లో ద్రవ్యోల్బణం గత రెండేళ్లలోనే రెట్టింపయ్యింది.
అగ్రరాజ్యం అప్రమత్తం:అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయులకు చేరి, కొన్ని నెలలుగా 8 శాతానికి పైనే నమోదవుతోంది. అమెరికా ప్రజలు గ్యాసోలిన్, నిత్యావసరాలకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. గ్యాసోలిన్, డీజిల్‌పై ఫెడరల్ పన్నులను 3 నెలలు వాయిదా వేయాలని అధ్యక్షుడు బైడెన్ ఇటీవల కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడరల్ రిజర్వ్) కీలక వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టి, ఉద్దీపన పథకాల్లో కోత అమలు చేస్తోంది. ఇందువల్ల ఏడాది-రెండేళ్లలో మాంద్యం చోటుచేసుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
యూకేలోనూ ఇంతే:యూకేలోనూ ద్రవ్యోల్బణం గత నెలలో 9.1 శాతానికి చేరుకుంది. ఇది 40 ఏళ్ల గరిష్ఠం. తినుబండారాలు, పెట్రోలు ధరలు అనూహ్యంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ముఖ్య ఆర్థిక వేత్త గ్రాంట్ ఫిట్జర్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి 11 శాతానికి చేరుకుంటుందని అంచనా. దీంతో బ్రిటన్ ప్రజల కష్టాలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పటికే అక్కడ అధిక ధరలకు తోడు నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి పరిస్థితులే ఇతర ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ.. తదితర దేశాల్లోనూ ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. రష్యాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశంలో ఇది గత నెలలో 17.1 శాతంగా నమోదైంది.
శ్రీలంక మాదిరిగా మరికొన్ని దేశాలు:మన పొరుగు దేశమైన శ్రీలంకలో అయితే ఏరోజుకారోజు పెట్రోలు, నిత్యావసరాల కోసం ప్రజలు వెతుక్కుంటున్నారు. విదేశీ మారకద్రవ్యం రూపేణా అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వైపు చూస్తోంది శ్రీలంక ప్రభుత్వం. ఆ దేశానికి 51 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్ల) విదేశీ అప్పు పేరుకుపోయింది. కరోనా పరిణామాలతో పర్యాటకుల రాక క్షీణించడం, అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆ దేశ పాలకుల స్వయంకృతం మరికొంత కారణం. భారతదేశం ఇస్తున్న రుణంతో ఆ దేశం ఎంతో కష్టంగా రోజులు నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితులే పాకిస్థాన్, నేపాల్‌లలోనూ కనిపిస్తున్నాయి. లెబనాన్, సూడాన్, వెనెజువెలా దేశాల్లో ద్రవ్యోల్బణం 200 శాతానికి మించింది. ఆ దేశాల్లో ఇప్పుడు కరెన్సీ విలువ నామమాత్రమే. ఆసియా- ఐరోపా ఖండాల మధ్య వారధిగా ఉండే తుర్కియే(ఇంతక్రితం టర్కీ) నాటో సభ్య దేశం. నిర్మాణ రంగం, వాహన పరిశ్రమలు, పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గానే ఉండేవి. మే నెలలో ద్రవ్యోల్బణం 73.5 శాతానికి చేరి ఆ దేశమూ తల్లడిల్లిపోతోంది.