Commercial LPG price hike: వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.102.5 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రూ.2253గా ఉన్న ఈ సిలిండర్ ధర రూ.2355.50కు పెరిగింది. ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.655కు చేరింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరిస్తాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలనెలా సిలిండర్ల రేట్లను సవరిస్తుంటాయి చమురు సంస్థలు. ఏప్రిల్‌లోనూ వాణిజ్య ఎల్పీజీ రేట్లను రూ.250 మేర పెంచాయి.
'ఎల్పీజీ' మంట... భారీగా పెరిగిన సిలిండర్ ధర - వాణిజ్య సిలిండర్ ధర
08:58 May 01
'ఎల్పీజీ' మంట... భారీగా పెరిగిన సిలిండర్ ధర
మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం చమురు సంస్థలు ఈ నెల కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుత ధరల ప్రకారం.. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ హైదరాబాద్‌లో రూ1,002కి లభిస్తోంది. కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50, దిల్లీలో రూ.949.50, ముంబయిలో 949.50గా ఉంది.
ఆల్‌టైమ్ గరిష్ఠానికి ఏటీఎఫ్:విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర సైతం భారీగా పెరిగింది. కిలో లీటరుకు రూ.3,649.13 చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా కిలోలీటరు ఏటీఎఫ్ ధర రూ.1,16,851.46కు ఎగబాకింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ఠం కావడం గమనార్హం. ప్రతి నెలా 1, 16వ తేదీల్లో ఈ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి. ఇలా ఈ ఏడాది వరుసగా తొమ్మిది సార్లు ఏటీఎఫ్ రేట్లు పెరిగాయి.
ఇదీ చదవండి:'మా భవిష్యత్ ఏంటి?'.. ట్విట్టర్ సీఈఓకు చుక్కలు చూపిస్తున్న ఉద్యోగులు!