TCS Q2 results 2022: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాల్లో జోరు కనబర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై- సెప్టెంబర్) రూ.55,309 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 18 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. కంపెనీ నికర లాభం సైతం 8.4 శాతం వృద్ధితో రూ.10,431 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.9,624 కోట్లుంగా ఉంది. గత త్రైమాసికంతో (రూ.9,478 కోట్లు) పోల్చినప్పుడు 10 శాతం మేర వృద్ధి చెందింది.
క్యూ2లో టీసీఎస్ అదుర్స్.. భారీగా పెరిగిన ఆదాయం.. లాభం 8శాతం జంప్ - టీసీఎస్ త్రైమాసికం ఫలితాలు
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ఆదాయంలో 18 శాతం వృద్ధి నమోదైంది. నికర లాభం సైతం గణనీయంగా పెరిగింది. తమ సేవలకు బలమైన డిమాండ్ ఉందని, కొత్త ఉద్యోగుల సంఖ్య సైతం పెరుగుతోందని సంస్థ వెల్లడించింది.
త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై వాటాదారులకు రూ.8 డివిడెండ్‌గా చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ సేవలకు బలమైన డిమాండ్ ఉందని, ఆర్డర్ బుక్ సైతం బలంగా ఉందని కంపెనీ సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాథ్ వెల్లడించారు. రెండో త్రైమాసికంలో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.16 లక్షలకు చేరిందని టీసీఎస్ తెలిపింది. క్యూ2 ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు 2 శాతం లాభంతో రూ.3,121 వద్ద ముగిసింది.