TCS Net Profit: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.9,926 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 7.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
ఇక కంపెనీ మొత్తం ఆదాయం రూ.50 వేల కోట్లు దాటింది. గతేడాదితో పోల్చినప్పుడు 15.8 శాతం వృద్ధితో మొత్తం రూ.50,591 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఒక త్రైమాసికంలో ఆదాయం రూ.50 వేల కోట్లు దాటడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే, గత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఆదాయం రూ.1,91,754 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోల్చినప్పుడు 16.8 శాతం వార్షిక వృద్ధిని టీసీఎస్ నమోదు చేసింది. వార్షిక లాభం 3.2 శాతం వృద్ధితో రూ.38,327 కోట్లుగా నమోదైంది.