IT jobs: ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాల జాతర జరగనుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో బీటెక్ విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభించనున్నాయి. ప్రాంగణ నియామకాలకే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల కళాశాల యాజమాన్యాలు కూడా కంపెనీలు కోరిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నాయి.
TCS Jobs: ఈ ఆర్థిక సంవత్సరంలో 40వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని ఐటీ దిగ్గజం టీసీఎస్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది. గతేడాది లక్ష మందిని కొత్తగా నియమించుకున్న ఈ సంస్థ.. ఐటీ రంగంలో డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది కూడా 40వేల మందిని రిక్రూట్ చేసుకోనుంది.
Infosys Jobs: దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కూడా ఈ ఏడాది 50వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటోంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డిమాండ్స్ పెరుగుతుండటం, సంస్థ వృద్ధి రేటు కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది. ఇన్ఫోసిస్ గతేడాది 85వేల మందిని కొత్తగా నియమించుకుంది.
HCL jobs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35000- 40000 ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు హెచ్‌సీఎల్ సంస్థ తెలిపింది. ప్రాజెక్టుల లభ్యత, సిబ్బంది వలసల వంటి అంశాలపై ఆధారపడి ఇవి ఉంటాయని సంస్థ సీఈఓ సి.విజయకుమార్ వివరించారు. 2022-23లో ఆదాయ పెరుగుదలలో టెలికాం, ఆర్థిక సేవలు, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ విభాగాలు కీలక పాత్ర పోషించవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌సీఎల్ ప్రస్తుత కేంద్రాల్లో కొన్నింటిని విస్తరించే అవకాశం ఉందన్నారు. వచ్చే 3-5 ఏళ్లలో నియర్‌షోర్ ప్రాంతాల్లో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. (అమెరికాకు సమీపంలో ఒకే టైమ్‌జోన్ ఉండే ప్రాంతాలకు నియర్‌షోర్ ప్రాంతాలుగా వ్యవహిస్తారు. మెక్సికో, టొరంటో, వాంకోవర్, కోస్టారికా, రొమేనియా వంటి నియర్‌షోర్ ప్రాంతాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.)
అంతర్జాతీయంగా నియర్‌షోర్ ప్రాంతాల్లో హెచ్‌సీఎల్ టెక్‌కు దాదాపు 10,000 మంది ఉద్యోగులున్నారు. ఈ ప్రాంతాల్లో కంపెనీ విస్తరణ కొనసాగుతుందని, అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్య 20,000కు చేరుతుందని విజయకుమార్ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఐరోపా నుంచి వచ్చే ప్రాజెక్టులపై ప్రభావం పడలేదని పునరుద్ఘాటించారు.
రెండో ఏడాది నుంచే: ఇప్పటి దాకా బీటెక్ మూడో ఏడాదిలో ప్రాంగణ నియామకాలు మొదలయ్యేవి. ప్రస్తుతం కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు రెండో ఏడాదిలోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ముందుగానే టాపర్లను తీసుకునేందుకు ఈ పంథాను అనుసరిస్తున్నాయి. డిజిటలీకరణతో కంపెనీలకు ప్రాజెక్టులు ఎక్కువగా వస్తుండటం వల్ల ప్రాంగణ నియామకాలు భారీగా పెరిగాయి. గతంలో కళాశాలలకే పరిమితమైన ప్రాంగణ ఎంపికలు ఇప్పుడు జాతీయ స్థాయి పోటీగా మారాయి. దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు జాతీయ స్థాయిలోనే ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విధానంతో ప్రతిభ ఉన్న వారికి మూడు, నాలుగు ఉద్యోగాలు లభిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని, అవసరమైన అంశాలపై తర్ఫీదును ఇప్పించేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు సన్నద్ధమవున్న నేపథ్యంలో కళాశాలలు కొన్ని నిబంధనలు విధిస్తున్నాయి. సూపర్ డ్రీం (రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు), డ్రీం (రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు) లాంటి ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతున్నాయి.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్: కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విధానాన్ని అవలంబిస్తూ... కళాశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తమకు ఇంత మంది అభ్యర్థులు కావాలి.. పలానా అంశాలపై శిక్షణ ఇవ్వండని ముందుగానే సూచిస్తున్నాయి. ఒకవేళ అలాంటి టాపిక్స్ కళాశాలల్లో లేకపోతే అక్కడి ఫ్యాకల్టీలకు శిక్షణ, ఇతరత్రా సహకారాన్ని అందిస్తున్నాయి. తమకు ఎంత మంది అభ్యర్థులు అవసరమో కంపెనీలు ముందుగానే చెబుతున్నాయి. తాము ఎంపిక చేసుకున్న వారిని వేరే కంపెనీల నియామకాలకు సంబంధించి తక్కువ ప్యాకేజీలకు పంపొద్దని కళాశాలలకు నిబంధనను విధిస్తున్నాయి. ఐదో సెమిస్టర్ నుంచే శిక్షణ ఇవ్వడం వల్ల ఆయా కంపెనీలకు అవసరమైన సాంకేతికత పరిజ్ఞానం కలిగి.. నేరుగా పనిచేసే ఉద్యోగులు లభిస్తున్నారు.
సాంకేతిక నైపుణ్య ఆధారిత నియామకాలు: సాఫ్ట్‌వేర్ సంస్థలు టెక్నాలజీ స్పెసిఫిక్ హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎంపిక పరీక్షలో 10 పర్సెంటైల్ సాధించిన వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్సుపై శిక్షణ అందిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తికి అనుగుణంగా ఒక అంశంపై స్పెషలైజేషన్ కోసం కృషి చేస్తున్నాయి. ఐదో సెమిస్టర్ నుంచే విప్రో శిక్షణ ఇస్తోంది. సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేథలాంటి గ్లోబల్ సర్టిఫికేషన్‌ను నిర్వహిస్తోంది. విప్రో కంపెనీ దీన్ని వెలాసిటీ నియామకాలుగా పేర్కొంటోంది. టెక్నాలజీ స్పెసిఫిక్ హైరింగ్ కింద నియమితులైన వారికి ఇతరులకు వేతనాల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. ఇతరులకు ఏడాది తర్వాత లభించే వేతనం 10 పర్సంటైల్ వారికి ముందుగానే వచ్చేస్తుంది.
జెన్సీప్రో పేరుతో కాగ్నిజెంట్ సంస్థ.. కళాశాలల విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన వారికి అమెజాన్ వెబ్ సర్వీసెస్, జావా ఫుల్‌స్టాక్‌లాంటి వాటిపై గ్లోబల్ సర్టిఫికేషన్ చేయిస్తోంది. ఒక్కో కళాశాలకు ఒక్కో అంశాన్ని ఇచ్చి.. తన అవసరాలకు అనుగుణంగా బీటెక్ ఆరో సెమిస్టర్‌లో 12 వారాలు శిక్షణ అందిస్తోంది.
మూడు నాలుగుసార్లు..:ప్రముఖ కంపెనీలు ప్రాంగణ ఎంపికలకు మూడు నుంచి నాలుగు పర్యాయాలు జాతీయ స్థాయి ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 2020-21తో పోల్చితే 2021-22లో ఈ మార్పు ఎక్కువగా ఉంది. అభ్యర్థుల అవసరాలు ఎక్కువగా ఉండటంతో ఎంపిక పరీక్షలను పెంచాయి. విప్రో నేషనల్ టాలెంట్ హంట్‌ను 2021-22కు సంబంధించి మూడు పర్యాయాలు నిర్వహించింది. హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లాంటి ప్రముఖ సంస్థలు అభ్యర్థుల ఎంపికకు పలుమార్లు పరీక్షలు పెడుతున్నాయి. దీనివల్ల అభ్యర్థి మొదటి ప్రయత్నంలో ఉద్యోగం సంపాదించలేక పోయినా సమగ్రంగా సన్నద్ధమైతే మరో రెండు అవకాశాల్లో ఉద్యోగం పొందొచ్చు. ఆయా సంస్థల నైపుణ్యంపై విద్యార్థులకు అవగాహన ఉంటే అవకాశాలు పొందడం తేలిక.
ఇదీ చదవండి:'అమెజాన్‌లో 11.6 లక్షల ఉద్యోగాలు!'