TCS CEO Salary 2023 : ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు ఆర్జించారు. గతేడాది 2022తో పోల్చితే ఆయన సంపాదన 13.17 శాతం పెరిగిందని టీసీఎస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. రాజేశ్ గోపీనాథన్ కాంపెన్సేషన్ 2022 సంవత్సరంలో 26.6 శాతం పెరిగింది.
TCS top executives salaries :
భారత దేశంలోనే ఐటీ రంగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల్లో రాజేశ్ గోపీనాథన్ 5వ వారు. ఈయన బేసిక్ శాలరీ రూ.1.7కోట్లు. కానీ కంపెన్సేషన్‌గా 25.75 కోట్లుగా తీసుకుంటున్నారు. రాజేశ్ గోపీనాథన్ ఈ సెప్టెంబర్ 16 వరకు టీసీఎస్ సలహాదారుగా కొనసాగనున్నారు. గోపీనాథన్ టీసీఎస్‌లో 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఎన్ చంద్రశేఖరన్ టీసీఎస్ ఛైర్మన్ అయిన తరువాత, 2017లో గోపీనాథన్ టీసీఎస్ సీఈఓ బాధ్యతలు స్వీకరించారు.
ఈ నెల మొదట్లో టీసీఎస్ సీఈఓగా కె కృతివాసన్ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీ కాన్పుర్‌లో చదువుకున్న కృతివాసన్ టీసీఎస్‌లో ముప్పై సంవత్సరాలకు పైగా వివిధ పదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీసీఎస్ సీఈఓగా కృతివాసన్ నెలకు రూ.10 లక్షలు బేసిక్ శాలరీగా తీసుకుంటున్నారని ఆ సంస్థ వెల్లడించింది. ఇది రూ.16 లక్షల వరకు చేరుకోవచ్చని, అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఆయనకు అందుతాయని స్పష్టం చేసింది.