TCS Brand Value :భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంస్థ బ్రాండ్ విలువ దాదాపు 43 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కంటార్ తన నివేదికలో పేర్కొంది. వ్యాపార సాంకేతికత రంగంలో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డిజిటల్ పరివర్తనను టీసీఎస్ విజయవంతంగా సొమ్ము చేసుకుంటోందని విశ్లేషించింది.
Top Brand Value Company In India : మరోవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మందగమన భయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ప్రభావం వల్ల.. ఈ ఏడాది 75 విలువైన భారతీయ సంస్థల బ్రాండ్‌ల విలువ 4 శాతం తగ్గినట్లు వెల్లడించింది. వీటి విలువ 379 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు కంటార్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది బ్రాండ్ విలువలో టీసీఎస్ 6 శాతం, ఇన్ఫోసిస్ 17 శాతం క్షీణత నమోదైనట్లు తెలిపింది. కంపెనీ విక్రయాల్లో విదేశీ అమ్మకాల వాటా గణనీయంగా ఉన్న కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్రాండ్ల విలువ తగ్గిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ల విలువలో 20 శాతం క్షీణత కనిపించగా.. భారత్‌లో అది నాలుగు శాతంగానే నమోదైనట్లు పేర్కొంది.
కరోనా తర్వాత వచ్చిన రికవరీ ప్రభావం తగ్గినప్పటికీ.. దేశీయ వినియోగం వల్ల భారత్ ఈ అంశంలో బలంగా ఉందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో బ్రాండ్ విలువ 23 శాతం పడిపోగా.. భారత్‌లో మాత్రం ఇది 14 శాతానికే పరిమితైందని చెప్పింది. దేశ జీడీపీ ఏటా ఏడు శాతం సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందినట్లు వివరించింది. అదే బ్రాండ్‌ల విలువ మాత్రం 19 శాతం పెరిగినట్లు పేర్కొంది. రాబోయే ఏళ్లలో మరింత వేగవంతమైన వృద్ధి నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.