Tax Relief On Rental Income: ఇంటి అద్దె ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యక్తులు తమ మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, దాని ప్రకారం వర్తించే శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏ ఇతర ఆదాయాలూ లేకుండా.. కేవలం అద్దె మొత్తమే రూ.2.5లక్షల లోపు ఉందనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్ను భారమూ ఉండదు. వచ్చే ఏడాది అద్దె 20శాతం పెరిగిందనుకుందాం.. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆస్కారం ఉంది.
ప్రామాణిక తగ్గింపు:ఇంటి యజమాని తనకు లభించిన అద్దె ఆదాయం నుంచి కొంత ప్రామాణిక తగ్గింపును పొందే వీలుంది. స్థూల అద్దె నుంచి ఆస్తి పన్ను చెల్లించగా మిగిలిన మొత్తంలో 30 శాతం వరకూ ఈ తగ్గింపు ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి రూ.3,20,000 అద్దె వచ్చిందనుకుందాం. ఆస్తి పన్ను రూ.20వేలు చెల్లిస్తే.. మిగిలిన ఆదాయం రూ.3లక్షలు. ఇందులో 30 శాతం అంటే.. రూ.90,000. ఇప్పుడు ఇంటి అద్దె ద్వారా లభించిన నికర ఆదాయం రూ.2,10,000 అన్నమాట. పన్ను గణనలో ఈ ఆదాయాన్నే లెక్కలోకి తీసుకుంటారు. ఎన్‌ఆర్‌ఐలకూ ఇంటి, స్థిరాస్తులపై వచ్చే వడ్డీకి ఈ ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుంది.