Tata To Make IPhones In India : భారత్‌లో ఐఫోన్లను ఇక టాటా గ్రూప్ తయారు చేయనుంది. దేశీయంగా ఐఫోన్లను తయారు చేసే విస్ట్రాన్ సంస్థకు, టాటా గ్రూప్‌కు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కర్ణాటకలో ఉన్న ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను.. టాటా గ్రూప్‌కు అమ్మేందుకు విస్ట్రాన్ బోర్డు అంగీకరించింది. సుమారు 125 మిలియన్ల డాలర్లకు ఈ డీల్ కుదిరింది. దీంతో మొదటి భారతీయ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్ నిలవనుంది. ఈ ఒప్పందానికి సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది విస్ట్రాన్ బోర్డు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్విట్టర్లో ఇదే విషయమై పోస్ట్ చేశారు.
"పీఎల్ఐ ప్రోత్సాహక పథకంతో భారత్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ తయారీ, ఎగుమతులకు నమ్మకమైన, ప్రధాన హబ్‌గా మారుతోంది. ఇక, రానున్న రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ కోసం టాటా గ్రూప్ భారత్‌లో ఐఫోన్ తయారీని ప్రారంభించనుంది. విస్ట్రాన్ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేసిన టాటా సంస్థకు అభినందనలు" అని రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ప్రస్తుతం విస్ట్రాన్ సంస్థ కర్ణాటకలో ఐఫోన్లను తయారు చేస్తోంది. ఇది తైవాన్‌కు చెందిన కంపెనీ. ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని భావించిన టాటా గ్రూప్.. విస్ట్రాన్ సంస్థతో ఏడాది పాటు చర్చలు జరిపింది. మొదట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్లాంట్ కొనుగోలుకే టాటా కంపెనీ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం విస్ట్రాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో టాటా కొనుగోలు ఆఫర్‌కు ఆమోదం లభించింది. కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్‌లో 100శాతం వాటాలను.. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్మేందుకు ఒప్పందం కుదిరింది.