Tata Safari Petrol Version :ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ టాటా మోటార్స్.. తమ సంస్థకు చెందిన ప్రీమియం రేంజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (SUV) కోసం కొత్త పెట్రోల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే వాటిని హారియర్, సఫారీ కార్లలో ఉపయోగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఈ రెండు వేరియెంట్లలో 2-లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను వినియోగిస్తున్నారు.
ఏటా 2లక్షల యూనిట్లు సేల్!
Tata Safari Yearly Sales : టాటా మోటార్స్‌కు ఆల్‌టైం బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా టాటా సఫారీ, హారియర్ కార్లు ఉన్నాయి. అయితే ఈ ప్రీమియం రేంజ్ కార్లు ఏటా రెండు లక్షల (Tata Harrier Yearly Sales) యూనిట్ల వరకు అమ్ముడవుతున్నట్లు ఆ కంపెనీ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర తెలిపారు. వీటిలో 80 శాతం డీజిల్ వాహనాలే అని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలోనే డీజిల్ ఇంజిన్‌పైనే ఎక్కువగా దృష్టి సారిస్తూనే.. మార్కెట్లో 20 శాతం డిమాండ్ ఉన్న ఎస్‌యూవీల్లో పెట్రోల్ ఇంజిన్ ఏర్పాటు విషయాన్ని తేలికగా తీసుకోలేమని శైలేశ్ చంద్ర చెప్పారు. ఇందుకోసమే 1.5 లీటర్ జీడీఐ (గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్) ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
"మార్కెట్లో మా ప్రీమియం రేంజ్ ఎస్‌యూవీలైన సఫారీ, హారియర్లకు భారీగా డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల వరకు యూనిట్లను విక్రయిస్తున్నాము. వీటిల్లో 80 శాతం డీజిల్ ఇంజిన్‌తో నడిచే వాహనాలే. ఈ పవర్‌ట్రెయిన్‌లో మెరుగైన టార్క్ పనితీరు కారణంగానే కస్టమర్లు ఎక్కువగా ఈ ఇంజిన్ ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. అలాగని 20 శాతం డిమాండ్ ఉన్న పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే వాహనాల అంశాన్ని కూడా విస్మరించలేము. అందుకని ప్రస్తుతానికి 1.5 లీటర్ GDI ఇంజిన్‌పై పని చేస్తున్నాము."