Tata Motors Passenger Vehicles Price Hike : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. ప్యాసెంజర్ వాహనాల ధరలను జులై 17 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. సాధారణ (ఐసీఈ)వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా 0.6 శాతం మేర పెరగనున్నట్లు స్పష్టం చేసింది. టాటా మోటార్స్‌కు చెందిన అన్ని మోడల్స్, వేరియంట్స్‌కు కూడా ఇదే విధానం వర్తిస్తుందని వెల్లడించింది. వాహనాల తయారీ ఖర్చులు పెరిగినందునే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ కంపెనీ పేర్కొంది.
జులై 16 లోపు బుక్ చేసుకుంటే..
త్వరలో వాహనాల ధరలు పెంచనున్నప్పటికీ.. జులై 16 లోపు ఎవరైతే టాటా మోటార్స్ వాహనాలను బుక్ చేస్తారో, వారికి మాత్రం ప్రైస్ ప్రొటెక్షన్ కల్పిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే వారికి 2023 జులై 31లోపు వాహనాన్ని డెలివరీ కూడా చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం టాటా మోటార్స్.. పంచ్, నెక్సాన్, హారియర్ సహా అనేక మోడల్స్ ప్యాసెంజర్ వాహనాలను మార్కెట్లో అమ్ముతోంది.
అమ్మకాలు పెరిగాయ్!
టాటా మోటార్స్ 2023 మే నెలలో దేశీయంగా 80,383 యూనిట్లు అమ్మినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో 79,606 యూనిట్లు మాత్రమే సేల్ చేసింది. దీనిని చూస్తే ఇప్పుడు టాటా మోటార్స్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని స్పష్టం అవుతోంది. గతేడాది కంటే ఈ సంవత్సరం టాటా మోటార్స్ డొమెస్టిక్ ప్యాసెంజర్ వాహనాల ధరలు (ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సైతం) 5 శాతం మేర పెరగడం గమనార్హం.