Tata Neu: ఈ కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపింది టాటా గ్రూప్. 'టాటా న్యూ' పేరుతో సూపర్ యాప్‌ను గురువారం లాంచ్ చేసింది. ఇక అన్ని బ్రాండ్లను ఒకే వేదిక ద్వారా ఉపయోగించేందుకు వీలు కల్పించింది. టాటా న్యూ రాకతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ కామర్స్ సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి టాటా న్యూ సూపర్ యాప్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఏమిటీ సూపర్ యాప్? :షాపింగ్ అవసరాలు, ఫుడ్ ఆర్డర్లు, ప్రయాణ టికెట్లు, హోటల్ బుకింగ్స్ కోసం మనం చాలా రకాల యాప్స్ వాడుతుంటాం. అయితే వాటన్నింటినీ ఒకే దగ్గర పొందగలగడమే ఈ సూపర్ యాప్ కాన్సెప్ట్. దీని ద్వారా ఫోన్లో స్టోరేజీ బాధ ఉండదు. అనేక యాప్‌ల కోసం సైన్అప్ అవ్వాల్సిన అవసరం లేదు.
'టాటా న్యూ'లో ఏమేం చేయొచ్చు? :టాటా గ్రూప్‌లోని అనేక బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదే 'టాటా న్యూ'. ఫైనాన్స్, మెడిసిన్, హాలిడే, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్ సహా మరెన్నో విభాగాల్లో ఈ యాప్ ద్వారా ఆఫర్లు పొందవచ్చు. బిగ్‌బాస్కెట్, ఎయిర్ ఏసియా, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్‌సైడ్, ఐహెచ్సీఎస్ వంటి సంస్థల నుంచి ఆకర్షణీయ ఆఫర్లు ఉంటాయి.
రివార్డ్ పాయింట్లు కూడా.. :టాటా న్యూ ద్వారా 'న్యూకాయిన్స్' అనే రివార్డు పాయింట్లు కూడా అందుతాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కొనుగోళ్లకూ పాయింట్లు వస్తాయి. వాటిని క్యాష్‌బ్యాక్‌గా, డిస్కౌంట్లుగా వాడుకోవచ్చు. ఈ రకంగా ఇది షాపింగ్‌తో పాటు యూపీఐ పేమెంట్స్ యాప్‌గానూ పనిచేస్తుంది. అమెజాన్, పేటీఎం, రిలయన్స్ జియో వంటి సంస్థలు ఇదివరకే తమ సూపర్ యాప్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి ద్వారా పేమెంట్లు, కంటెంట్ స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్, గ్రాసరీస్ వంటి సేవలను అందిస్తున్నాయి. ముఖేశ్ అంబానీకి చెందిన జియో మార్ట్ కూడా త్వరలోనే ఈ సూపర్ యాప్ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది.
ఇదీ చదవండి:టాటా కొత్త కార్ అదుర్స్.. ధరల పెంపుతో మారుతీ షాక్.. 20వేల వాహనాలు రీకాల్