Systematic Withdrawal Plan Mutual Fund :ప్రతి ఒక్కరికీ నిర్ణీత ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా వారి పెట్టుబడి విధానం మారుతుంది. ఇలాంటి సమయాల్లో చాలా మంది మదుపరులు మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గుచూపిస్తారు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం- ఎస్‌ఐపీ అందుబాటులో ఉంది. ఈ విధానం ద్వారా నెలకు నిర్ణీత మొత్తాన్ని మనం అనుకున్నంత కాలంపాటు పెట్టుబడి పెట్టవచ్చు. దీన్నే సిప్ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో మంచి రాబడి ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇందులో అనుకున్నంత కాలం మదుపు చేసిన తర్వాత.. ఆ డబ్బును ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. లేదా సిప్ చేసినట్లుగానే ఎస్‌డబ్ల్యూపీ విధానంలో నెలనెలా మన అవసరాలకు కోసం కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంది.
ఇలా పనిచేస్తుంది!
Systematic Withdrawal Plan : మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసిన డబ్బులను ఒకేసారి వెనక్కి తీసుకోకుండా.. క్రమానుగతంగా తీసుకోవడమే సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్- ఎస్‌డబ్ల్యూపీని. అయితే ఇందులో నెలకు ఎంత మొత్తం అవసరమో ముందే నిర్ణయించుకోవాలి. ఆ మేరకు ఫండ్ సంస్థ యూనిట్లను విక్రయించి.. డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.
How SWP Plan Works :మనం పోగు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని నెలకే కాకుండా, మూడు, ఆరు నెలలు, సంవత్సారానికి ఒకసారి వచ్చే ఏర్పాటు కూడా చేసుకునే వీలుంది. నెలకు లేదా అనుకున్న కాలానికి నిర్ణీత సంఖ్యలో యూనిట్లను విక్రయించాల్సిందిగా మనం సూచించవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో వచ్చే మొత్తంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక కచ్చితమైన మొత్తమే కావాలనుకుంటే.. ఆ మేరకు ఫండ్ సంస్థ యూనిట్లను విక్రయిస్తుంది.