Marc faber: 'ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల'ని స్విస్ పెట్టుబడిదారు,'ది గ్లూమ్ బూమ్ డూమ్' ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. 'అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ'ని వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్'కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ..
అమెరికాలో వడ్డీరేట్లు బాగా పెరుగుతాయా:ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచాల్సిందే. జపాన్ - ఇంగ్లండ్ - కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచిన సమయంలోనే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా చర్యలు తీసుకుంటే బాగుండేది. ద్రవ్యోల్బణం మాయమవుతుందని ఇటీవలి దాకా చాలామంది అన్నారు. ఇపుడు ఆరు నెలల్లో లేదా 2023లో మాంద్యం రావొచ్చని అంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికా కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ ఏడాది, వచ్చే రెండేళ్లూ రాణిస్తాయనే అంటున్నారు. కానీ గరిష్ఠాల నుంచి అమెరికా కార్పొరేట్ల లాభాలు 50 శాతం తగ్గొచ్చని నేను భావిస్తున్నా. అమెరికా ఫెడ్ మాత్రం వడ్డీరేట్లు మరీ ఎక్కువగా పెంచదు.. వచ్చే 6 నెలల్లో మళ్లీ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే భావిస్తున్నా.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరల నుంచి వర్థమాన దేశాల పెట్టుబడుదార్లు ఎలా తప్పించుకోవాలి:పెరుగుతున్న కమొడిటీ ధరల నుంచి సాధారణంగా వర్థమాన దేశాలు ప్రయోజనం పొందుతుంటాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెద్ద మాంద్యంలోకి వెళ్లి.. కమొడిటీ ధరలు మరింత తగ్గితే.. వేర్వేరు విభాగాల్లో పెట్టుబడులు పెట్టడమే మంచిదంటాను. అన్ని విభాగాల్లోనూ నష్టపోయే వాతావరణం కనిపిస్తోంది కాబట్టి అతి తక్కువగా నష్టపోయే వ్యూహం రచించుకోవాలి.
భారత మార్కెట్లపై మీ అభిప్రాయం:దీర్ఘకాలానికి భారత్‌పై చాలా సానుకూలంగా ఉన్నాను. అయితే ప్రపంచం శాంతియుతంగా ఉంటేనే సానుకూలతలకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత ఈక్విటీలు అధిక ధరల్లో ఉన్నాయి.. ఇవి మరింత తగ్గితే, అపుడు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. షేర్ల విలువలు బాగా తగ్గినప్పుడు, కొనేందుకు ఎక్కువమంది సుముఖత చూపరు. ఏడాది సమయంలో బేర్ ర్యాలీ అనంతరం కొనుగోళ్లకు ఎక్కువ అవకాశాలు కనిపించొచ్చు.