దిగ్గజ కార్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరికొత్త ఇంధన వ్యూహాన్ని ప్రకటించింది. తమ నుంచి రాబోయే సీఎన్జీ మోడళ్ల కార్లను నడపడానికి ఆవుపేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ బనాస్ డెయిరీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)తో సుజుకీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆవుపేడ నుంచి బయోగ్యాస్ తయారుచేసే జపాన్‌కు చెందిన ఫుజిసాన్ అసగిరి బయోమాస్‌లోనూ పెట్టుబడి పెట్టినట్లు సుజుకీ తన 2030 ప్రణాళికలో పేర్కొంది.
"భారతీయ మార్కెట్ 2030 ఆర్థిక సంవత్సరం వైపు దూసుకెళ్తోంది. అదే తరహాలో వివిధ ఉత్పత్తుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గినప్పటికీ.. మొత్తంగా CO2 ఉద్గారాలు పెరుగుతున్నాయి. కార్ల అమ్మకాలు, CO2 ఉద్గారాలను తగ్గించడం మధ్య సమతుల్యత ఉండాలని భావిస్తున్నాం" అని సుజుకీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆవుపేడ, బయోగ్యాస్ గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభిస్తుంది. దీనికి అధునాతను సాంకేతికత జోడిస్తే కర్బణ ఉద్గారాలు చాలా మేరకు తగ్గే అవకాశముంది. అందులో భాగంగానే సుజుకీ.. నేషనల్ డెయిరీ అభివృద్ధి బోర్డు, ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ బనాస్ డెయిరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బయోగ్యాస్‌ను ఇండియా, జపాన్‌తో పాటు ఆసియాన్(ASEAN) దేశాలు, ఆఫ్రికా దేశాల్లో కూడా ఉపయోగించనున్నట్లు తెలిపింది.