Suzlon Tulasi Tanti Died: సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసీ తంతి తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన శనివారం సాయంత్రం మరణించినట్లు తులసీ తంతి కుటుంబసభ్యులు తెలిపారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించి భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించారు. దీంతో ఆయనను అందరూ 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు.
శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశం నుంచి పుణెకు కారులో వెళ్తున్న సమయంలో తులసీ తంతికి ఛాతీలో నొప్పి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే డ్రైవర్ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడని, కానీ మార్గమధ్యలోనే తులసి మరణించారని చెప్పారు.
1958లో రాజ్‌కోట్‌లో జన్మించిన తులసీ తంతి గుజరాత్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1995లో రూ.8,535 కోట్ల విలువైన సుజ్లాన్ ఎనర్జీని స్థాపించారు. 2006 మే 10 నుంచి బెల్జియం కేంద్రంగా పనిచేసే టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థకు ఛైర్మన్‌తోపాటు ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ 1.5 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కలిగి ఉంది. దాంతో పాటు ప్రపంచంలోని 18 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తులసీ తంతి నాయకత్వంలో సుజ్లాన్ కంపెనీ బెంచ్‌మార్క్‌లను దాటి ప్రపంచ పునరుత్పాదక ఇంధన మార్కెట్లో ప్రముఖ సంస్థగా పేరుగాంచింది. తులసీ తంతికి భార్య గీత, కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి ఉన్నారు.
మోదీ సంతాపం..
తులసీ తంతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "తులసీ తంతి.. భారతదేశ ఆర్థిక పురోగతికి దోహదపడిన ఒక వ్యాపార నాయకుడు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా తులసీ తంతి అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో పవన విప్లవానికి నాయకత్వం వహించిన ఆయన.. దేశ ఆర్థిక పురోగతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఇవీ చదవండి:రూ.500తోనే బంగారం, వెండిలో మదుపు.. ఇవి తెలుసుకోండి!
మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రూ.1.47 లక్షల కోట్లు రాబడి