Sukanya Samriddhi Yojana Interest Rate Hike :సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఈ పథకం కింద చేసే డిపాజిట్లకు 20 బేసిస్ పాయింట్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లకు 10 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర చిన్న మొత్తాల సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఈ మేరకు జనవరి-మార్చి కాలానికి వర్తించే వడ్డీ రేట్లపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సుకన్య సమృద్ధి స్కీమ్ కింద డిపాజిట్లకు ఇప్పటివరకు 8 శాతం వడ్డీ లభిస్తుండగా ఇకపై 8.20 శాతం చెల్లించనున్నారు. మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీ రేటు 7 శాతం ఉండగా దాన్ని 7.1 శాతానికి పెంచారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- పీపీఎఫ్, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం పీపీఎఫ్‌లకు 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్లకు 4శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
- కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై వడ్డీ రేట్లలో మార్పు లేదు.
- కేవీపీ వడ్డీ రేటు 7.5 శాతం ఉండగా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 7.7 శాతం వడ్డీ లభించనుంది.
- మంథ్లీ ఇన్కమ్ స్కీమ్‌పై యథాతథంగా 7.4 శాతం వడ్డీ కొనసాగనుంది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. 2022 మే నుంచి కీలక వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచింది ఆర్బీఐ. ఈ నేపథ్యంలో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చింది. అయితే, 2023 ఫిబ్రవరి నుంచి జరిగిన పాలసీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.