Subrata Roy Dead :సహారా గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లు కంపెనీ వెల్లడించింది. సుబ్రతా రాయ్ చాలా కాలంగా మెటా స్టాటిక్ కేన్సర్, హై బీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడం వల్ల ముంబయిలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారని.. అక్కడే చికిత్స పొందుతూ మరణించారని కంపెనీ తెలిపింది. సుబ్రతారాయ్ మృతితో సహారా ఇండియా పరివార్ శోకసముద్రంలో మునిగిపోయిందని పేర్కొంది.
Subrata Roy Death News : 1948 జూన్ 10న బిహార్‌లోని అరారియాలో జన్మించిన రాయ్ గోరఖ్‌పూర్‌లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్‌ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్‌ను 1976లో కొనుగోలు చేసిన రాయ్ 1978 కల్లా దానిని సహారా ఇండియా పరివార్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆర్థిక, మీడియా, స్థిరాస్తి, ఆతిథ్య రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
పెరోల్‌పై ఉండగానే మృతి
Subrata Roy News : ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది. మదుపర్ల నుంచి సేకరించిన రూ.62,600 కోట్ల నగదును రిఫండ్ చేయాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోరినప్పటికీ అందులో విఫలం కావడం వల్ల సుప్రీం కోర్టు ఆదేశాల మధ్య రాయ్ తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పెరోల్‌పై ఉంటున్న రాయ్ మంగళవారం కన్నుమూశారు.