Stock Markets Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 632 పాయింట్లు పెరిగి.. 54 వేల 885 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల లాభంతో 54 వేల 937 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదుచేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 16 వేల 352 వద్ద సెషన్‌ను ముగించింది. గత సెషన్లో సెన్సెక్స్ 503, నిఫ్టీ 144 పాయింట్లు పెరిగాయి.
ఆయిల్ అండ్ గ్యాస్, లోహ రంగ సూచీలు మినహా అన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున పుంజుకున్నాయి. అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ రాణించాయి. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్ పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం సెషన్లో లాభాలతో ముగిసిన నేపథ్యంలో.. మన సూచీలు పుంజుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి టెక్ స్టాక్‌లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం కలిసొచ్చింది. చమురు ధరలు పెరగడం మాత్రం మదుపర్లను కలవరపెడుతోంది. ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం అన్నీ లాభాల్లోనే ఉన్నాయి.