- 04.24PM
Stock Market Today 14th December 2023 : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం సూచీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 21,150 పాయింట్ల ఎగువస్థాయిలో నిలిచింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.4లక్షల కోట్లు పెరిగి రూ.355 లక్షల కోట్లకు చేరింది.
ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో గురువారం ఉదయం సెన్సెక్స్ 70,146 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. అలా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,110.75- 70,602.89 మధ్య కదలాడింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 256.35 పాయింట్ల లాభంతో 21,182.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 75.63 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బంగారం ఔన్సు 2049 డాలర్లకు ఎగబాకింది.
సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, టైటాన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
- 10.00AM
Stock Market Today 14th December 2023 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయులను తాకాయి. సెన్సెక్స్ సూచీ 70,540 పాయింట్లను తాకి ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ సూచీ కూడా 21,190 పాయింట్లకు చేరి జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని అమెరికా ఫెడరల్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతకుముందు సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్లకు పైగా లాభంతో 70,245 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 21,110 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
తాజా ర్యాలీతో బీఎస్‌ఈలో-లిస్టెడ్ సంస్థల Mcap రికార్డు స్థాయిలో రూ.354.41 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మదుపర్ల సంపద రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది.
మరోవైపు యూఎస్ ఫెడ్ నిర్ణయం ఆసియా-పసిఫిక్‌లోని మార్కెట్ సూచీలపైనా సానుకూల ప్రభావం చూపాయి. ఒక్క జపాన్ సూచీ మినహా మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం భారీ లాభాల్లోనే ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.