Stock Market Today 12th January 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 847 పాయింట్లు లాభపడి 72,568 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్లు వృద్ధిచెంది 21,894 వద్ద జీవన కాల గరిష్ఠాలతో స్థిరపడింది.
శుక్రవారం ఒకానొక సమయంలో సెన్సెక్స్ 72,720 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ 21,928 వద్ద ఆల్ టైమ్ హై రికార్డ్‌ను నిలకొల్పింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సహా, ఐటీ స్టాక్స్ భారీ లాభాలు మూటగట్టుకోవడమే ఇందుకు కారణం.
- లాభపడిన స్టాక్స్ : ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టపోయిన షేర్స్ : బజాజ్ ఫిన్సెర్వ్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ఐటీ స్టాక్స్ ర్యాలీ
- దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు దాదాపుగా 8 శాతం వరకు లాభపడింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ భారీ లాభాలు ఆర్జించింది. దీనితో మదుపరులు ఇన్ఫోసిస్ స్టాక్స్ కొనుగోలుకు ఎగబడ్డారు.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 4 శాతం వరకు లాభపడింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 8.2 శాతం వరకు లాభాలు నమోదు చేయడమే ఇందుకు కారణం.
- టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు కూడా గణనీయంగా లాభాలు నమోదు చేశాయి.
- దేశీయ సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో, బీఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ అత్యధికంగా 5.06 శాతం పెరిగింది. టెక్ సెక్టార్ కూడా 4.40 శాతం మేర లాభపడింది.
- ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇవాళ మంచి లాభాలను మూటగట్టుకున్నాయి.
మార్కెట్‌పై ప్రభావం చూపుతాయా?
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తరువాత పారిశ్రామిక ఉత్పత్తి (IIP), వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. ఇవి రేపటి దేశీయ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.