తెలంగాణ

telangana

ETV Bharat / business

కుప్పకూలిన ఐటీ సెక్టార్​- సెన్సెక్స్​ 1172 డౌన్​ - బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ

Stock market: అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలకు తోడు ఐటీ ఇండెక్స్​ కుప్పకూలటం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ ఏకంగా 1170, నిఫ్టీ 300 పాయింట్లకుపైగా నష్టపోయాయి. స్టాక్​ మార్కెట్ల భారీ నష్టాలకు ప్రధాన కారణాలు తెలుసుకోండి.

Stock market close
స్టాక్​ మార్కెట్​

By

Published : Apr 18, 2022, 3:42 PM IST

Stock market: అంతర్జాతీయంగా డాలర్​ ఇండెక్స్​ 100కుపైగా చేరుకోవటం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరోవైపు.. ఉక్రెయిన్​-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యే ప్రమాదం ఉందని మదుపరులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతలతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ ఐటీ సెక్టార్​ ఏకంగా 4 శాతం, బ్యాంకు ఇండెక్స్​ 2 శాతం మేర నష్టపోవటమూ ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ 1172 పాయింట్ల నష్టంతో 57,167 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 57,338 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 56,842 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న సూచీ చివరకు 57, 167 వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,173 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో.. 17,183 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఓ దశలో 17,067 పాయింట్ల కనిష్ఠ, 17,238 పాయింట్ల గరిష్ఠ స్థాయిలను తాకింది. చివరకు.. 17,173 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి:ఎన్​టీపీసీ, టాటాస్టీల్​, నెస్లే, టైటాన్​, హిందూస్థాన్​ యూనిలివర్​, మారుతి, పవర్​ గ్రిడ్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. మరోవైపు.. ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్,​ రిలయన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, ఎస్బీఐ నష్టాలను మూటగట్టుకున్నాయి.

మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణాలు:భారత్​లో ద్రవ్యోల్బణం: ఈ ఏడాది మార్చిలో రిటైల్​ ద్రవ్యోల్బణం 6.95 శాతం మేర నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూన్​లో ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు. 2023 ఏప్రిల్​ నాటికి రెపోరేటు 5.5 శాతానికి చేరుకుంటుందని హెచ్​ఎస్​బీసీ అంచనా వేసింది.

4 శాతం పడిపోయిన ఐటీ ఇండెక్స్​:దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 6 శాతం మేర పడిపోవటం వల్ల ఐటీ ఇండెక్స్​ 4 శాతం మేర నష్టపోయింది. 2020, మార్చి 23 తర్వాత ఇన్పోసిస్​ ఈ మేర దిగజారటం ఇదే తొలిసారి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆశించిన దాని కంటే ఆదాయం తగ్గిపోవటం వల్ల ఇన్ఫోసిస్​ మార్జిన్​ అంచనాలను విశ్లేషకులు తగ్గించారు. ఇన్ఫోసిస్​ తర్వాత ఎంఫాసిస్​, టెక్​ మహీంద్రా, మైండ్​ట్రీ​, టీసీఎస్​ భారీగా నష్టాల్లోకి జారుకోవటమూ నష్టాలకు కారణమే.

ముడి చమురు ధరలు:రష్యాపై ఆంక్షలు తీవ్రతరం చేస్తున్న క్రమంలో అంతర్జాతీయంగా సరఫరా తగ్గిపోవటం వల్ల సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ ధర 1.50 డాలర్లు లేదా 1.3 శాతం మేర పెరిగింది. ప్రసుతం బ్యారెల్​ ధర 113.20 డాలర్లుగా ఉంది. ఆంక్షల కారణంగా సోమవారం నుంచి రష్యా నుంచి రావాల్సిన రోజుకు 3 మిలియన్​ బ్యారెల్స్​ నిలిచిపోయినట్లు అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది.

అంతర్జాతీయ మార్కెట్ల పతనం:ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్ర బ్యాంకుల ప్రాబల్యాన్ని తగ్గించే ఉద్దేశంతో అమెరికా పాలసీని కఠినతరం చేయటం మదుపరులను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఆ దేశ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఆసియా మార్కెట్లలో నిక్కీ ఒక శాతం మేర నష్టపోగా.. హంగ్​సెంగ్​ 0.5 శాతం మేర పడిపోయింది.

చైనా జీడీపీ వృద్ధి రేటు: 2022 తొలి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికం 4శాతంతో పోల్చితే ఎక్కువే ఉన్నా.. షాంఘై వంటి పెద్ద నగరాల్లో కొవిడ్​ కేసులు పెరుగుతుండటం, కఠిన లాక్​డౌన్​ అమలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై మరింత పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details