స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వాహన రంగ షేర్లు పుంజుకోవడం, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగాలు రాణించడం వల్ల మార్కెట్లు లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 443 పాయింట్లు పుంజుకొని 52,265 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాలు గడించాయి. మారుతీ సుజుకీ షేరు విలువ అత్యధికంగా 6 శాతం పెరిగింది. మహీంద్ర అండ్ మహీంద్ర, ఏషియన్ పేంట్స్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, సన్‌ఫార్మా, విప్రో షేర్లు రాణించాయి.
మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతో ముగిసింది. 143 పాయింట్లు పుంజుకొని 15,556 వద్ద స్థిరపడింది.
రూపాయి మారకం...
మరోవైపు, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం 19 పైసలు బలహీనపడిన రూపాయి.. గురువారం ఉదయం 9 పైసలు పుంజుకుంది. ఫలితంగా ఫారిన్ ఎక్స్ఛేంజ్లో డాలరుతో పోలిస్తే 78.26 వద్దకు చేరింది. అనంతరం, ముడి చమురు ధర ప్రభావంతో ఒత్తిడికి గురైంది. ఓ దశలో 78.38 స్థాయికి పడిపోయిన రూపాయి.. చివరకు సరికొత్త జీవితకాల కనిష్ఠమైన 78.32 వద్ద ముగిసింది.