Stock Market All Time High Close : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఆల్టైమ్ రికార్డుస్థాయికి చేరాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 529 పాయింట్లు లాభపడి.. 66,589 పాయింట్ల జీవితకాల గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 147 పాయింట్లు ఎగబాకి.. 19,711 వద్ద స్థిరపడింది.
Stock Market Closed Today : సోమవారం ఉదయం 66,190 వద్ద ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. కాసేపటికే లాభాల బాట పట్టింది. ఆ తర్వాత మరింత జోరును చూపించింది. చివరకు 529 పాయింట్లు లాభపడి.. 66,589 వద్ద స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ కూడా 19,612 వద్ద ప్రారంభమై.. చివరకు 147 పాయింట్ల లాభంతో 19,711 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
భారీగా ఆ కంపెనీల షేర్లు కొనుగోళ్లు..
బ్యాంకింగ్, ఆయిల్ కంపెనీల షేర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డును నమోదు చేశాయి. విదేశీ నిధుల వెల్లువ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయిలలో ముగిశాయి. చైనా జీడీపీ డేటా తక్కువగా ఉండటం వల్ల ఆసియా స్టాక్ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. దీంతో భారత షేర్ మార్కెట్లు ఎన్నడూ లేని గరిష్ఠ స్థాయిలో ముగిసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మరోవైపు ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై నష్టాలతో ముగిశాయి.