ఈ వారంలో 3 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వస్తుంటే, 'ఈ ఏడాదిలో భారీగా లాభాలు అందించిన 4 చిన్న స్థాయి కంపెనీల షేర్ల' ముఖ విలువ విభజన జరుగుతోంది. అవేమిటంటే..
అల్‌స్టోన్ టెక్స్‌టైల్స్:
జనవరి నుంచి ఈ షేరు విలువ సుమారు 1000 శాతం పెరిగినా, గత శుక్రవారం 5 శాతం నష్టంతో రూ.170.30 వద్ద ముగిసింది. రూ.217 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ స్మాల్ క్యాప్ షేరును 1:10 నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 షేర్లుగా) విభజిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అలాగే 9:1 నిష్పత్తిలో (ప్రతి ఒక షేరుకు 9 షేర్ల చొప్పున) బోనస్ షేర్లు కూడా జారీ చేయనున్నారు.
స్టార్ హౌసింగ్ ఫైనాన్స్:
రూ.415 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ కంపెనీ స్టాక్‌ను ఈ నెల 16 నుంచి 1:2 నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును రూ.5 ముఖ విలువ కలిగిన 2 షేర్లుగా) విభజిస్తున్నారు. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు కూడా జారీ చేస్తున్నారు. ఇదీ 16 నుంచే అమల్లోకి వస్తుంది. గత శుక్రవారం ఈ షేరు 2.24% నష్టంతో రూ.211.35 వద్ద ముగిసింది.
ఎస్‌టీ కార్పొరేషన్:
రూ.210 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ షేరు ఈ ఏడాది ప్రారంభం నుంచి 1350 శాతం లాభాలు పంచింది. గత శుక్రవారం 5 శాతం నష్టపోయి రూ.328 వద్ద ముగిసింది. ఈ నెల 16 నుంచి ఈ షేరును 1:5 నిష్పత్తిలో విభజిస్తున్నారు. అంటే రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విడిపోతాయి.
లాన్సర్ కంటెయినర్ లైన్స్:
వాటాదార్లకు ఈ ఏడాదిలో 110 శాతం వరకు లాభాలు పంచిన ఈ స్మాల్ క్యాప్ షేరును ఈ నెల 16 నుంచి 1:2 నిష్పత్తిలో (రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును రూ.5 ముఖ విలువ కలిగిన 2 షేర్లుగా) విభజిస్తున్నారు. గత శుక్రవారం 0.05 శాతం నష్టంతో రూ.457.05 వద్ద ఈ షేరు ముగిసింది. రూ.1,377 కోట్ల మార్కెట్ విలువ ఉన్న సంస్థ ఇది.
ఈ షేర్లన్నీ చాలా తక్కువ మార్కెట్ విలువ కలిగినవి కావడం, ఇటీవల కాలంలో వీటి విలువలు భారీగా పెరిగిన నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.