Stock market investments: స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు పదే పదే వస్తూనే ఉంటాయి. మార్కెట్ దశలను అర్థం చేసుకోవడం, వాటిని తట్టుకునేందుకు సిద్ధం కావడం.. మదుపరిగా మనం చేయాల్సింది ఇదే. పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే 'ఏటా 10-20 శాతం దిద్దుబాటు ఉండే అవకాశం ఉంది' అని స్పష్టంగా అనుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీ పెట్టుబడుల విలువను లెక్కించుకుంటూ ఉండండి. ఈక్విటీల్లో 80శాతం మించకుండా చూసుకోండి. మిగతా మొత్తాన్ని డెట్ ఫండ్లలోకి మళ్లించండి. పెట్టుబడుల విలువను ఎప్పుడూ ఈ ప్రామాణిక అంచనాతో అనుసంధానం చేయండి. దీనివల్ల తాత్కాలికంగా వచ్చే హెచ్చుతగ్గులను సమన్వయం చేసుకునేందుకు వీలవుతుంది. నష్టాన్ని భరించే మీ సామర్థ్యం ఆధారంగా నిధుల కేటాయింపు ఉండాలి.
రెండేళ్ల కాలంలో స్టాక్ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మీ ఈక్విటీ పెట్టుబడుల విలువ మీ పోర్ట్‌ఫోలియోలో 5 -10 శాతం అధికంగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడుల్లో సర్దుబాటు చేసుకునేందుకు ఇది సరైన సమయంగా చెప్పొచ్చు. మంచి పనితీరు ఉన్న కంపెనీలు, ఫండ్లలో పెట్టుబడులు కొనసాగించాలి. ఈక్విటీ పెట్టుబడులను మీరు అనుకున్న ప్రామాణిక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
రానున్న ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగుంటుందని అంచనా ఉందనుకుందాం. అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు సానుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉండాలి.