stock market losses: రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, అధిక చమురు, కమొడిటీల ధరలు, విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావంతో కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాదిలో ఇప్పటికే 10 శాతం మేర నష్టపోయాయి. గతేడాది అక్టోబరులో జీవనకాల గరిష్ఠ స్థాయిలను తాకిన ఈ సూచీలు.. అక్కడి నుంచి 15% మేర పతనమవ్వడం గమనార్హం. దేశంలోని దిగ్గజ కంపెనీల సమూహ సూచీ బీఎస్‌ఈ 500 కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 శాతం నష్టపోయింది. ఇందులో 85 శాతానికి పైగా షేర్లు ప్రస్తుతం 200 రోజుల చలన సగటు (డీఎంఏ) దిగువన ట్రేడవుతున్నాయట. 200 డీఎంఏ దిగువకు రావడమంటే.. చౌక లేదంటే ఆకర్షణీయ ధరలకు షేర్లు లభ్యమవుతున్నాయనే భావన కొందరి మదుపర్లలో ఉంటుంది. ఇప్పటికే బాగా పడిపోయినందున మున్ముందు మరింత పెరుగుతుందని అనుకుంటుంటారు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ తరహా షేర్లను సిఫారసు చేస్తుండటంతో వాళ్లూ కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు.
అయితే ఇలా చేయడం సరైనదేనా?:200 డీఎంఏ దిగువకు వచ్చిన షేర్లను కొంటే నిజంగా లాభదాయకమేనా? 200 డీఎంఏ దేనికి సంకేతం.. ఫలానా షేరు లేదా సూచీ సమీపకాలంలో ఎలా కదలాడుతుందనే విషయాన్ని గుర్తించేందుకు పలు రకాల ఇండికేటర్‌లపై మదుపర్లు లేదా స్టాక్ మార్కెట్ నిపుణులు ఆధారపడుతుంటారు. వీటిని ఆయా షేర్లు లేదా సూచీల చార్టుల్లో ఏర్పాటు చేసుకుంటారు. 200 డీఎంఏ రేఖ కూడా ఈ ఇండికేటర్‌ల్లో ఒకటి. గత 200 రోజులు లేదా 40 వారాల్లో ఆయా షేరు సగటు ధరను ఇది సూచిస్తుంది. ‘200 డీఎంఏ రేఖ పైన షేరు కదలాడుతుంటే.. ఆ షేరు సానుకూలంగా కదలాడొచ్చని భావిస్తుంటారు. ఈ రేఖ ఆ షేరుకు మద్దతు స్థాయిగా పనిచేస్తుండటమే ఇందుకు కారణం. ఒకవేళ 200 డీఎంఏ కంటే దిగువన కదలాడితే.. ఆ రేఖను నిరోధ స్థాయిగా భావించి, షేరుకు ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావిస్తార’ని గ్రీన్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్ శర్మ వివరించారు. 200 డీఎంఏ ఎగువన కదలాడే షేర్లతో పోలిస్తే 200 డీఎంఏ దిగువన కదలాడే షేర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. అది మార్కెట్లో నిస్తేజానికి, ప్రతికూల భావనకు సంకేతమని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక్కదానిపై ఆధారపడొద్దు..: 'స్టాక్ మార్కెట్ కదలికలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేం. అలాంటిది ఒక్క సంకేతం (ఇండికేటర్) ఆధారంగా షేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం సరికాదు. సాంకేతిక అంశాలపరంగా ఎన్ని సానుకూలతలు ఉన్నా ఒక్క ప్రతికూల పరిణామం మార్కెట్ గతిని మార్చేస్తుంది. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తత అవసరం' అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 200 డీఎంఏ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. దీని ఒక్కదానిపై ఆధారపడకుండా.. మరికొన్ని ఇండికేటర్‌లు ఇచ్చే సంకేతాలను, దేశీయ అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకునే షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపాలని షేర్‌ఖాన్‌లో పరిశోధనా విభాగం హెడ్‌గా ఉన్న గౌరవ్ రత్నపార్ఖి సూచిస్తున్నారు. సూచీలు, షేర్ల కదలికలను గుర్తించడంలో 200 డీఎంఏకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదని, అది కేవలం ఒక అంకె అనే విషయాన్ని గుర్తించుకోవాలని హెడోనోవాకు చెందిన ఓ విశ్లేషకుడు అంటున్నారు.