Stock Market Closing: కిందటి సెషన్లో భారీ నష్టాలను నమోదుచేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. వారాంతపు సెషన్లో ఘనంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1534 పాయింట్లు పెరిగి.. 54 వేల 326 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 457 పాయింట్ల లాభంతో 16 వేల 266 వద్ద సెషన్‌ను ముగించింది.
ఫార్మా, లోహం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీలు 3-4 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్నీ లాభాల్లోనే ముగియడం విశేషం. అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ రాణించాయి. అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,437 కోట్ల ఆదాయాన్ని, రూ.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో ఇవాళ్టి సెషన్లో ఈ షేరు 7 శాతానికిపైగా (రూ. 302) దూసుకెళ్లింది. రిలయన్స్ 6 శాతానికిపైగా పెరిగింది. శ్రీ సిమెంట్స్, యూపీఎల్ మాత్రం స్వల్పంగా నష్టపోయాయి.
గురువారం సెషన్లో భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినా.. యూఎస్ ఫ్యూచర్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం సానుకూలంగా కదలాడాయి. యూఎస్ ఫ్యూచర్స్, ఆసియా సూచీల నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదుచేశాయి.