తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్‌ రంగంలో ఇబ్బందులున్నాయి, ప్రైవేటీకరిస్తే మరింత రిస్క్​ - ప్రముఖ ఆర్థికవేత్త ప్రణబ్​ సేన్ వార్తలు

బ్యాంకింగ్‌ రంగ ఆస్తులు,అప్పుల విషయంలో భారీ అసమతౌల్యం ఏర్పడిందని, అది ఎప్పుడైనా పేలిపోయే బుడగలా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రణబ్‌సేన్‌ అన్నారు. చాలా బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉన్నందున, ఈ పరిణామం ఇంకా జరగలేదని వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే రిస్కు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

statistician-pranab-sen-about-problems-in-banking-sector
statistician-pranab-sen-about-problems-in-banking-sector

By

Published : Aug 25, 2022, 8:35 AM IST

Pranab Sen Banking: దేశీయ బ్యాంకింగ్‌ రంగ ఆస్తులు-అప్పుల విషయంలో భారీ అసమతౌల్యం నెలకొందని, అది ఎప్పుడైనా పేలిపోయే బుడగలా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రణబ్‌సేన్‌ అభిప్రాయపడ్డారు. చాలా బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉన్నందున, ఈ పరిణామం ఇంకా జరగలేదని వెల్లడించారు. పరిశ్రమను నియంత్రించే చట్టాలను పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు బ్రిటీష్‌ నమూనాను అనుసరించాయని, ఆ చట్టాల ప్రకారం.. రుణదాతలు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు అనుమతించడం లేదన్నారు. డిపాజిట్ల రూపంలోనే అధిక భాగం నిధుల్ని బ్యాంకులు తీసుకుంటున్నాయని తెలిపారు.

"ఇవాళ బ్యాంక్‌ రుణాల సరాసరి వ్యవధి 9 ఏళ్లుగా ఉంటోంది. అదే డిపాజిట్ల వ్యవధి సరాసరిన రెండున్నరేళ్లకు మించి ఉండటం లేదు. దీంతో ఆస్తుల వైపు 9 ఏళ్లు, అప్పుల వైపు 2.5 ఏళ్లు ఉంటున్నాయి. ఇదే భారీ అసమతౌల్యానికి దారి తీస్తోంద"ని స్టాటిస్టికల్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ కూడా అయిన ప్రణబ్‌ సేన్‌ బంధన్‌ బ్యాంక్‌ 7వ వార్షికోత్సవంలో వెల్లడించారు.

20 ఏళ్ల కిందట పరిస్థితి వేరు.. రెండు దశాబ్దాల కింద చూస్తే బ్యాంకుల రుణాల్లో 70 శాతం వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలే ఉండేవి. 20 శాతం రిటైల్‌ రుణాలు, 10 శాతం కంపెనీలకు అందించే కాలావధి రుణాలు ఉండేవి. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ కోసం రుణ పోర్ట్‌ఫోలియోలో కాలావధి రుణాలు 45 శాతం, వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు సుమారు 35 శాతంగా ఉంటున్నాయి. అందుకే చట్టాలను ఒకసారి పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని ప్రణబ్‌సేన్‌ అభిప్రాయపడ్డారు. క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రుణదాతలు నిధుల్ని సమీకరించేందుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జపాన్‌, ఐరోపా తరహాలో బ్యాంకింగ్‌ చట్టాలను తీసుకు రావాలని పేర్కొన్నారు.

కొవిడ్‌-19 సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) బాగా దెబ్బతిన్నాయని, వాటి పునః నిర్మాణానికి సహకరించాలని సూచించారు. గతంలో వీటికి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఆసరాగా ఉండేవని, ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితీ దయనీయంగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు జట్టు కట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే రిస్కు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణతో ఆయా బ్యాంకుల పూర్తి డిపాజిట్‌, రుణ పోర్ట్‌ఫోలియో ప్రభుత్వ మద్దతు లేకుండా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుందని ప్రణబ్‌ వివరించారు.

ఇవీ చదవండి:బ్యాంకు బంపర్ ఆఫర్, ఫోన్ కొనుక్కునేందుకు రూ.2లక్షల అలవెన్సు

కొత్తగా ఇన్సూరెన్స్​​ పాలసీ తీసుకుంటున్నారా, అయితే ఇది మీకోసమే

ABOUT THE AUTHOR

...view details