ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక స్వేచ్ఛను సాధించడం ఎంతో కీలకం. సొంతిల్లు, పిల్లల ఉన్నత చదువులు, వారి పెళ్లి, రుణాలను తిరిగి చెల్లించడం ఇలా ఎన్నో విషయాల్లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మహిళల విషయానికి వస్తే ఇప్పటికీ ఆర్థిక స్వాతంత్య్రం సాధించలేదనే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 2.3 శాతం పెరిగింది. 2020లో 22.8 శాతం ఉండగా, 2021లో 25.1 శాతానికి చేరింది. కానీ, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
మహిళలు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన తరుణమిది. ఇదే క్రమంలో సరైన పథకాలను ఎంచుకొని, వాటిలో పెట్టుబడి పెట్టేందుకూ సిద్ధం కావాలి. మహిళలు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వీలు కల్పించే పథకాల్లో రాబడి హామీతో ఉన్న బీమా పాలసీలూ కీలకమని చెప్పొచ్చు. ఒకే పథకం ద్వారా రెండుప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఈ గ్యారంటీడ్ రిటర్న్స్ ప్లాన్‌లు తోడ్పడతాయి. ఇందులో జీవిత బీమా రక్షణతోపాటు, హామీతో కూడిన రాబడీ అందుతుంది. వీటిలో ఉండే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే..
రాబడి- రక్షణ
సాధారణంగా మహిళలు అధిక నష్టభయం ఉన్న పథకాలకు దూరంగా ఉంటారు. కొత్తగా మదుపు చేసేవారికి ఇవి సరిపోవు కూడా. రాబడి హామీ బీమా పథకాల్లో నష్టభయం ఉండదు. కాబట్టి, వీటిలో సులభంగా మదుపు చేసేందుకు వీలుంటుంది. నష్టభయం తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. పెట్టుబడికీ రక్షణ ఉంటుంది కాబట్టి, ఎలాంటి ఇబ్బందీ ఉండదు.