తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో బాగా తగ్గిన స్మార్ట్​ఫోన్​ సరఫరాలు.. కారణాలివేనా! - Smartphone shipments

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు ఈ ఏడాది జులై- సెప్టెంబరులో 10 శాతం తగ్గి మూడేళ్ల కనిష్ఠమైన 4.3 కోట్లకు పరిమితమయ్యాయని వెల్లడించింది మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ. బలహీన గిరాకీ, అధిక ధరలు పండగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది.

Smartphone shipments
Smartphone shipments

By

Published : Nov 27, 2022, 6:43 AM IST

Updated : Nov 28, 2022, 1:05 PM IST

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు ఈ ఏడాది జులై- సెప్టెంబరులో 10 శాతం తగ్గి మూడేళ్ల కనిష్ఠమైన 4.3 కోట్లకు పరిమితమయ్యాయని మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2019 తర్వాత ఒక త్రైమాసికంలో నమోదైన అత్యల్ప సరఫరాలు ఇవేనని తెలిపింది. బలహీన గిరాకీ, అధిక ధరలు పండగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది. మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో 5జీ ఫోన్‌ల వాటా 36 శాతానికి (1.6 కోట్లు) చేరింది. జూన్‌ త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ సగటు ధర 377 డాలర్లు (దాదాపు రూ.30,600) కాగా, సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 393 డాలర్ల (దాదాపు రూ.32,000)కు పెరిగిందని వెల్లడించింది.

  • స్మార్ట్‌ఫోన్‌ నిల్వలు పేరుకుపోగా, పండగల తర్వాత గిరాకీ సహజంగానే తగ్గుతుంది కనుక డిసెంబరు త్రైమాసికంలోనూ సరఫరాలు స్తబ్దుగా ఉండొచ్చని పేర్కొంది. ఫలితంగా 2022 వార్షిక సరఫరాలు 8-9 శాతం తగ్గి దాదాపు 15 కోట్లుగా నమోదుకావొచ్చని ఐడీసీ డివైస్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవ్కేందర్‌ సింగ్‌ వెల్లడించారు. 2023లోనూ గిరాకీపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపొచ్చని.. అధిక ధరల నేపథ్యంలో ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మారడం నెమ్మదించొచ్చని అంచనా వేశారు. 4జీ నుంచి 5జీ ఫోన్లకు మారేవారితో మధ్యశ్రేణి, ఖరీదైన విభాగాలకు కలిసిరావొచ్చని అభిప్రాయపడ్డారు.
  • అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌తో పాటు ఇతర ఇకామర్స్‌ పోర్టళ్ల ఆఫర్లతో ఆన్‌లైన్‌ విక్రయాలు మెరుగ్గానే ఉన్నాయని, సంప్రదాయ విక్రయాలు మాత్రం 20 శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది.
  • మొత్తం మార్కెట్‌లో మీడియాటెక్‌ చిప్‌సెట్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్‌కామ్‌ 25 శాతానికి, యునిసాక్‌ 15 శాతానికి తగ్గాయి.
  • షియామీ 21.2 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉన్నా, సరఫరాలు తగ్గాయి. శామ్‌సంగ్‌ 18.5 శాతం వాటాతో రెండో స్థానాన్ని మళ్లీ దక్కించుకుంది. వివో (14.6 శాతం), రియల్‌మీ (14.2 శాతం), ఓపో (12.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం విభాగంలో యాపిల్‌ (63 శాతం) అగ్రస్థానం కొనసాగించింది.

శామ్‌సంగ్‌.. 13% తగ్గొచ్చు!
వచ్చే ఏడాది శామ్‌సంగ్‌ తమ స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలను 13 శాతం తగ్గించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 పరిణామాలతో పాటు పలు కారణాల వల్ల ఈ ఏడాది కంపెనీ ఆశించిన స్థాయిలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించలేకపోయింది. అందువల్ల వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలను 13 శాతం తగ్గించి 3 కోట్లకు పరిమితం చేయొచ్చని అంటున్నారు. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు త్రైమాసికంలో సరఫరాల పరంగా కంపెనీ మార్కెట్‌ వాటా పెరగలేదు. 2021తో పోలిస్తే మొత్తంగా 8 శాతం క్షీణత నమోదైంది. వచ్చే ఏడాది అంతర్జాతీయంగా శామ్‌సంగ్‌ 27 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించొచ్చని అంచనా వేస్తున్నారు. 2022లో విక్రయించగలమని భావిస్తున్న 26 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఇవి ఎక్కువే. అయితే లాభదాయకత పెంచుకునేందుకు ఫోల్డబుల్‌ ఫోన్లపై కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Last Updated : Nov 28, 2022, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details