Small Saving Schemes New Rules in Telugu: ఇటీవల కాలంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. తాజాగా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్‌తో సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. నవంబర్ 9 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం కేంద్రం తొమ్మిది రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. ఆ స్కీమ్స్‌లో మార్పులను ఆర్థిక వ్యవహారాల శాఖ నోటిఫై చేసింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 9 స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (POTD), అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) ఉన్నాయి. ప్రతి పథకానికీ వేర్వేరు ఫీచర్లు, పదవీకాలాలు, వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో మారిన రూల్స్‌ను పరిశీలిస్తే..
పోస్టాఫీసులో ఇన్ని పొదుపు పథకాలా? ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినా సూపర్ బెనిఫిట్స్!
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో మారిన రూల్:సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కోసం కొత్త నిబంధనను ఆర్థిక శాఖ తీసుకొచ్చింది. కొత్త రూల్ ప్రకారం.. ఈ ఖాతా తెరవడానికి ఉన్న సమయాన్ని మూడు నెలలకు పొడిగించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఒక వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల లోపు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఖాతాను తెరవొచ్చు. ఇప్పటి వరకు ఈ వ్యవధి ఒక నెల మాత్రమే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిన తేదీని ఖాతా ఓపెనింగ్ సమయంలో రుజువుగా చూపాలి.