టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దానిలో అనేక మార్పులు చేశారు. వినియోగదారుల నుంచి అనేక సలహాలు కోరిన మస్క్.. తాజాగా తన అధికార నాయకత్వంపై నెటిజన్ల ఒపీనియన్‌ను అడిగారు. ట్విట్టర్ యూజర్స్‌ను ఉద్దేశిస్తూ.. "నేను ట్విట్టర్ నుంచి వైదొలగాలా?" అని అడిగారు. ఎలాన్ మస్క్ పెట్టిన ఈ పోల్‌లో దాదాపు 1.10 కోట్ల మంది పాల్గొన్నారు. వారిలో 56.3 శాతం మంది మస్క్‌ను వ్యతిరేకించారు. 43.7 శాతం మంది ఆయనకు మద్దతుగా ఓటు వేసి తననే అధినేతగా ఉండమని కోరారు. "మీ నుంచి వచ్చిన ఫలితాలకు నేను కట్టుబడి ఉంటాను. ట్విటర్ అధినేత పదవి నుంచి తప్పుకోవాలా? " అని ట్వీట్ చేశారు మస్క్.
'ట్విట్టర్ హెడ్‌గా వైదొలగాలా?'.. పోల్ పెట్టిన మస్క్.. దిగిపోవాలన్న మెజారిటీ యూజర్స్
ట్విట్టర్‌లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన నూతన అధినేత ఎలాన్ మస్క్.. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ద్వారా తన వినియోగదారుల స్పందనను కోరారు. "నేను ట్విట్టర్ హెడ్ పదవి నుంచి వైదొలగాలా?" అని పోల్ పెట్టగా.. నెటిజన్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. 56 శాతం మందికి పైగా వ్యతిరేకించారు.
"ఇకపై ట్విట్టర్‌లో చేసే ప్రధాన మార్పులకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇలాంటి తప్పులు మళ్లీ చేయను. నన్ను క్షమించండి". అని మరో ట్వీట్ చేశారు. మూడో ట్వీట్లో "మీరు కోరుకున్న దానిపట్ల జాగ్రత్తగా ఉండండి. అప్పుడే అనుకున్నది పొందగలరు" అని ఓ సామెతని పోస్ట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మస్ట్డాన్ సహా మరికొన్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించి తమ ప్రమోషన్లను.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసే వారి అకౌంట్లు త్వరలోనే తొలగిస్తామని సంస్థ ఆదివారం ప్రకటించింది. ఈ ట్వీట్ చేసిన వెంటనే మస్క్ తన నాయకత్వంపై నెటిజన్ల స్పందన కోరారు. "మా వినియోగదారులు చాలా మంది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉన్నారని మేము గుర్తించాము. అయితే, ఇకపై ట్విట్టర్‌లో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత ప్రమోషన్స్‌ను అనుమతించము" అని ట్విట్టర్ సపోర్ట్ ఓ ట్వీట్ చేసింది.
ఎలాన్ మస్క్ కార్యకలాపాలను పరిశీలిస్తూ కథనాలు రాసే పలువురు ప్రముఖ జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ డిసెంబర్ 15న నిలిపివేసింది. వీరిలో స్వతంత్రంగా పనిచేసే జర్నలిస్టులతో పాటు న్యూయార్క్ టైమ్స్, సీఎన్‌ఎన్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర సంస్థలకు చెందిన వారూ ఉన్నారు. ఈ నిషేధం ఏడు రోజుల పాటే ఉంటుందని మస్క్ ప్రకటించినప్పటికీ కొంత మంది జర్నలిస్టులు తమ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా రద్దయినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. దీనిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. ఎలాన్ మస్క్ జర్నలిస్టులను ట్విట్టర్ నుంచి తొలగించడం చాలా ప్రమాదకరమైన చర్యగా పేర్కొన్నారు.