కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్దేశించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో ఏడు రాష్ట్రాలు 90%కి పైగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. ఇదివరకు వరల్డ్ బ్యాంక్ చేయూతతో సులభతర వాణిజ్యం పేరుతో ర్యాంకులు ప్రకటిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలు పేరుతో రాష్ట్రాల పనితీరును మదింపుచేసి ‘బిజినెస్ రీఫామ్స్ యాక్షన్ ప్లాన్ 2020’ పేరుతో నివేదిక రూపొందించింది. దాని ప్రతిని గురువారం ఇక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌లు విడుదల చేశారు. ఐదు మినహా మిగిలిన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును వెల్లడించారు.
అక్షర క్రమంలో పేర్లు
ఈసారి ర్యాంకులవారీగా కాకుండా టాప్ అచీవర్స్ (90%కి పైగా), అచీవర్స్ (80-90%), యాస్పైరర్స్ (50-80%), ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ (50% లోపు) పేరుతో గ్రూపులవారీగా లెక్కించారు. రాష్ట్రాల పేర్లను అక్షరక్రమంలో ప్రకటించారు తప్పితే అవి సాధించిన స్కోర్ ఆధారంగా కాదు. 15 విభాగాలకు సంబంధించి 301 సంస్కరణల ఆధారంగా ఈసారి రాష్ట్రాల పనితీరును లెక్కగట్టారు. ఇందులో 118 కొత్త సంస్కరణలున్నాయి. తొలిసారి టెలికాం, సినిమా షూటింగ్, టూరిజం, అగ్నిమాపకదళ నిరభ్యంతర పత్రాల జారీ, వైద్య ఆరోగ్యరంగానికి సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సేవలు అందించేందుకు సింగిల్ విండో విధానం అమలు, నేషనల్ సింగిల్ విండో విధానంతో అనుసంధానం కావడం, కంప్యూటరైజ్డ్ సెంట్రల్ ర్యాండం ఇన్‌స్పెక్షన్ సిస్టం, నిర్మాణ అనుమతుల కోసం సమీకృత దరఖాస్తు ప్రక్రియ అమలు, నీరు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్ లాంటి వాటి జారీ ప్రక్రియను సులభతరం చేయడం, పెట్టుబడులకు అనువుగా ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాల పనితీరును లెక్కించారు.