September 30 Deadline for These Financial Tasks Know Full Details in Telugu : మనం ప్రస్తుతం సెప్టెంబర్ నెల మధ్యలో ఉన్నాం. మరో రెండు వారాల్లో ఈనెల ముగియనుంది. అయితే.. ఈ క్రమంలో మీరు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ మదుపర్లు నామినీని ఎంచుకోవడానికి ఈనెలతోనే గడువు ముగియనుంది. అలాగే.. కొన్ని బ్యాంకులు తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో మదుపు చేసేందుకూ చివరి నెల సెప్టెంబరే. ఇంకా.. మరికొన్ని ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా సెప్టెంబర్ 30వ తేదీయే (Financial Deadlines in September) ఆఖరి గడువుగా ఉంది. ఈ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే ఆర్థికంగా మీరే నష్టపోతారు. మరి, అవేంటి అన్నది ఈ స్టోరీలో చూద్దాం..!
చిన్న పొదుపు పథకాలకు ఆధార్ అనుసంధానం(Small Saving Schemes Aadhaar Link) : మీరు ముందుగా పూర్తి చేయాల్సిన విషయం ఆధార్ కార్డుకు సంబంధించినది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(SCSS), ఇతర పోస్టాఫీసు సేవింగ్స్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టినవారు సెప్టెంబర్ 30లోపు ఆధార్ వివరాలు తప్పక అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సకాలంలో సమర్పించకపోతే.. అక్టోబర్ 1 నుంచి సదరు కస్టమర్ల అకౌంట్లు తాత్కాలికంగా నిలిపివేయబడతాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
ప్రత్యేక ఎఫ్‌డీల్లో మదుపు(Fixed Deposits)..ఆర్బీఐ మే 2022 నుంచి రెపోరేటు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా ఫిక్స్ డిపాజిట్ వడ్డీరేట్లను అందుకు అనుగుణంగా సవరించాయి. కొన్ని బ్యాంకులు ఈ క్రమంలో అధిక వడ్డీరేట్లతో ప్రత్యేక డిపాజిట్ పథకాలనూ తీసుకొచ్చాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ వీ కేర్(SBI WeCare) స్కీమ్ అందిస్తోంది. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఈ స్కీమ్ కింద సాధారణ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు.. అంటే మొత్తం 100 బేసిస్ పాయింట్ల వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద బ్యాంక్ 7.50 శాతం వడ్డీ తన ఖాతాదారులకు ఆఫర్ చేస్తోంది. అయితే.. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.