తెలంగాణ

telangana

ETV Bharat / business

Senior citizen health insurance : తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - health care tips

Senior citizen health insurance : మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? వారి భవిష్యత్​ అవసరాల కోసం ఏమైనా చేద్దామనుకుంటున్నారా? అయితే కచ్చితంగా సీనియర్​ సిటిజన్లకు వర్తించే ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోండి. అయితే ఇలాంటి పాలసీలను తీసుకునే ముందు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు గురించి ముందుగా తెలుసుకోండి.

health insurance for senior citizens
పెద్దల కోసం హెల్త్​ ఇన్సూరెన్స్​

By

Published : Jun 14, 2023, 2:48 PM IST

Senior citizen health insurance : భారతదేశం ప్రస్తుతం యువతీయువకుల దేశం. దాదాపు 65 శాతం భారతీయులు 35 ఏళ్ల కంటే కాస్త తక్కువ వయస్సు ఉన్నవారే. యువతకు అన్ని జీవిత బీమా పథకాలు, ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉంటాయి. మరి వృద్ధుల మాట ఏమిటి? మన ఇంట్లోని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వారికి ఆరోగ్య సమస్య వస్తే ఏమిటి చేయడం?

నేడు యువత మెరుగైన అవకాశాల కోసం సొంత ఊరు వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కానీ ఊళ్లో ఉన్న తమ పెద్దల శ్రేయస్సు గురించి వారు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్య బీమా పాలసీలు ఎంతో అక్కరకు వస్తున్నాయి. సీనియర్​ సిటిజన్ల కోసం బీమా సంస్థలు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల కోసం మంచి ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి. ఏఏ అంశాలు కచ్చితంగా పరిశీలించి చూసుకోవాలో తెలుసుకుందాం.

వయస్సుతో పాటు పెరిగే ఆరోగ్య సమస్యలు
సహజంగానే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు, వైద్య పరమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. మరోవైపు వైద్యపరమైన ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే.. ఇప్పటి వరకు మనం చేసిన పొదుపు, సంపాదన పూర్తిగా వాడాల్సి వస్తుంది. ఇది మీతోపాటు మీ తల్లిదండ్రుల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎదురవకుండా ఉండడానికి, కాస్త ధర ఎక్కువైనా.. విస్తృత కవరేజీ ఉండే పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే తక్కువ మొత్తం పాలసీలు అన్ని సమయాల్లో సరిపోవు. వాస్తవానికి బీమా మొత్తాన్ని ఎంచుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కించుకోవాలి. కనీసం మూడేళ్లకు ఒకసారి అయినా మీ ఆరోగ్య బీమా పాలసీని సమీక్షించుకోవాలి.

ఉపపరిమితులు లేకుండా చూసుకోండి
పాలసీలు తీసుకునే ముందు.. వెయిటింగ్ పీరియడ్​ తక్కువగా ఉండే విధంగా చూసుకోండి. సాధారణంగా కొన్ని రకాల వ్యాధుల చికిత్స కోసం బీమా సంస్థలు 3 నుంచి 4 ఏళ్ల పాటు వేచి ఉండే వ్యవధి ఉండాలని చెబుతాయి. ఈ వ్యవధి ముగిసిన తరువాత మాత్రమే మీకు బీమా రక్షణ కల్పిస్తాయి. కనుక తక్కువ వ్యవధి ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. అదే సమయంలో పాలసీలో ఉండే ఉపపరిమితులను కూడా తప్పక గమనించాలి. గది అద్దె, ఐసీయూలో చికిత్సలు, శస్త్ర చికిత్సలు తదితర అంశాలపై కొన్నిసార్లు పరిమితులు ఉంటాయి. దీని వల్ల మీరు పాలసీ ఉన్నప్పటికీ.. మీ సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి రావచ్చు. కనుక సాధ్యమమైనంత వరకు ఉపపరిమితులు లేకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉపపరిమితులు ఉన్నా.. అవి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

ఇంటి వద్ద చికిత్సకు కూడా..
కొన్ని సార్లు ఆసుపత్రికి వెళ్లకుండా.. ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంటి వద్ద ఉండి, చికిత్స తీసుకున్నప్పటికీ పరిహారం ఇచ్చేలా పాలసీని తీసుకోవాలి. వాస్తవానికి ఇది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. ఆయా బీమా సంస్థలను అనుసరించి ఈ నిబంధనలు మారుతూ ఉంటాయి. సీనియర్​ సిటిజన్లకు పాలసీని తీసుకునేటప్పుడు ఈ అంశాన్ని తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

నెట్​వర్క్​ ఆసుపత్రుల మాటేమిటి?
నగదు రహిత చికిత్సల కోసం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులతో బీమా సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉంటాయి. కనుక పాలసీ తీసుకునేటప్పుడు ఈ నెట్​వర్క్​ ఆసుపత్రులు మీకు అందుబాటులో ఉన్నాయో, లేదో చూసుకోవాలి. అలాగే నెట్​వర్క్ ఆసుపత్రులు విస్తృతంగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఒక వేళ మీకు దగ్గరల్లో నెట్​వర్క్​ ఆసుపత్రులు లేకపోతే.. అది మీకు ఏవిధంగానూ ఉపయోగపడకపోవచ్చు.

పాలసీకి అనుబంధంగా రైడర్లు తీసుకోండి
ఆరోగ్య బీమా పాలసీకి అనుబంధంగా అనేక రైడర్లు ఉంటాయి. అందులో మీకు అవసరమైన రైడర్లను ఎంచుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఫిజియో థెరపీ, నర్సింగ్​ కేర్​, మెడికల్​ కన్సల్టేషన్​, అంబులెన్స్ లాంటి సేవలకు కూడా పరిహారం అందేలా రైడర్లను తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు చాలా సంస్థలు సీనియర్​ సిటిజన్ల కోసం ప్రత్యేక పరికరాలను కూడా అందిస్తున్నాయి. వీటి బీమా సంస్థల మొబైల్ యాప్​లకు అనుసంధానం చేసుకోవచ్చు. పెద్దవారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ పరికరాలు, వారి సమస్యను గుర్చించి, యాప్​ల ద్వారా సమాచారం మీకు క్షణాల్లో అందుతుంది. అంతేకాదు వెల్​నెస్​ కవర్​ లాంటి రైడర్లను ఎంచుకుంటే.. ఆరోగ్య పరీక్షలు, టెలిమెడిసిన్ చేసుకోవడానికి వీలవుతుంది. టాపప్​ పాలసీలను పరిశీలించడం కూడా అవసరమే.

తల్లిదండ్రులకు ఓ కానుకగా..
మంచి ఆరోగ్య బీమా పాలసీ మీ తల్లిదండ్రులకు మీరిచ్చే గొప్ప కానుక అవుతుంది. ఇది వారి భవిష్యత్​ కోసం దాచుకున్న పొదుపు మొత్తాన్ని కాపాడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. మీకు కూడా అటు ఆర్థికంగానూ, ఇటు మానసికంగానూ ప్రశాంతతను అందిస్తుంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details