పాత వాహనాల క్రయవిక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సరళతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. డీలర్ ప్రామాణికతను గుర్తించేందుకు నమోదిత వాహనాల డీలర్లకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తీసుకొచ్చింది. సులభతర వ్యాపారాన్ని, పారదర్శకతను ప్రోత్సాహించేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది. డిసెంబరు 22న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పాత వాహనాలను రిజిస్టర్డ్ డీలర్ల ద్వారా విక్రయించడానికి అనుమతిస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989లోని చాప్టర్-3ని సవరించింది.
పాత వాహనాలు అమ్మడం ఇక చాలా ఈజీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి.. - పాత వాహనాలు అమ్మడం రూల్స్
పాత వాహనాల క్రయవిక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సరళతరం చేయడానికి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. డీలర్ ప్రామాణికతను గుర్తించేందుకు నమోదిత వాహనాల డీలర్లకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తీసుకొచ్చింది.
డీలరును సంప్రదిస్తే చాలు
ఈ కొత్త నిబంధనలు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటినుంచి పాత వాహనాల యజమానుల తరఫున అధీకృత డీలర్లే క్రయవిక్రయాలు జరపడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాహన యజమాన హక్కుల బదిలీని ఫామ్ 29 రూపంలో దాని యజమానే సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంది. కానీ కొత్త నిబంధనల ప్రకారం యజమాని కానీ, లేదంటే రిజిస్టర్డ్ డీలరుకానీ యాజమాన్య హక్కుల బదిలీకి దరఖాస్తు సమర్పించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల వాహనాలు అమ్మదలుచుకున్నవారు డీలరును సంప్రదిస్తే సరిపోతుంది. యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనితప్పుతుంది.
ఇలా చేయాలి..
- ప్రస్తుత వాహన యజమాని తన వాహనాన్ని ఫలానా డీలరుకు అప్పగిస్తున్నట్లు చెబుతూ ఫామ్29సిని ఎలక్ట్రానిక్ రూపంలో అధికారులకు సమర్పించాలి.
- వెంటనే ఆటోజనరేటెడ్ అక్‌నాలెడ్జిమెంట్ నంబరు వస్తుంది.
- అప్పటినుంచి ఆ వాహనాలపై లావాదేవీలు నిర్వహించే అధికారం సంబంధిత డీలర్‌కు దఖలుపడుతుంది.
- ఒకవేళ డీలరు నుంచి ఆ వాహనాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఫామ్ 29డిని సమర్పించాల్సి ఉంటుంది. అప్పటి నుంచి దానిపై పాత యజమానికే పూర్తి హక్కులు వస్తాయి. వాటిపై లావాదేవీలు జరిపే అధికారం డీలర్‌కు ఉండదు.
- 29సి ఫామ్ సమర్పించిన తర్వాత డీలరే దాని ఊహాజనిత యజమాని (డీమ్డ్ ఓనర్) మారిపోతారు. ఆ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లకు, వాటి ద్వారా జరిగే సంఘటనలకు అతనే జవాబుదారీ అవుతారు.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వాహన యాజమాన్య హక్కుల బదిలీ అన్నీ డీలరు చేతులమీదుగానే నిర్వహించడానికి వీలు కలుగుతుంది.