Petrol price hike in India:కొద్దిరోజులుగా దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం లీటర్పెట్రోల్పై రూ.8, డీజిల్‌పై రూ. 6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గించింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరల్ని స్థిరంగా కొనసాగిస్తున్నా.. మళ్లీ వినియోగదారులపై భారం మోపక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణం.. ప్రైవేట్ రిటెయిలర్స్. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. దేశీయంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగించడం తమ వల్ల కాదని జియో-బీపీ, షెల్ పీఎల్సీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు తేల్చిచెబుతున్నాయి.
పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని.. లీటర్ పెట్రోల్‌పై రూ. 20-25, డీజిల్‌పై రూ.14-18 మేర నష్టపోతున్నామని ఇంధన మంత్రిత్వ శాఖకు తెలిపాయి ప్రైవేట్ రిటెయిలర్స్. వీలైనంత త్వరగా జోక్యం చేసుకొని.. సమస్యకు పరిష్కారం చూపాలని కోరాయి.
ఆయిల్ మార్కెట్లో 90 శాతం ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణలోనే ఉంది. ఆ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరకు విక్రయిస్తుండగా.. ప్రైవేటు సంస్థలపై భారం పడుతోంది. ఫలితంగా విక్రయం తగ్గి, వినియోగదారులను కోల్పోవాల్సి వస్తోంది.
2021 నవంబర్ నుంచి.. 2022 మార్చి 21 వరకు అంటే దాదాపు 137 రోజులు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. 5 నెలల తర్వాత 2022 మార్చి 22న తొలిసారి ఇంధన ధరలు పెరిగాయి. అదీ ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో పెంచాల్సి వచ్చిందని కేంద్రం వివరణ ఇచ్చింది. వరుసగా 14 రోజులు.. సగటున 80 పైసల చొప్పున ఇంధన ధరలు పెంచుకుంటూ వెళ్లాయి చమురు సంస్థలు. మళ్లీ ఏప్రిల్ 6 నుంచి స్థిరంగా ఉంచాయి.
ఈ నేపథ్యంలోనే.. రిటెయిలింగ్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్‌ఐపీఐ) పేర్కొంది. అందుకే.. ప్రైవేట్ రిటెయిలర్స్కు మద్దతుగా నిలవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఇటీవల లేఖ కూడా రాసింది. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచకపోతే భారీగా నష్టాలు వస్తున్నాయని.. ఇది డీలర్స్, ట్రాన్స్పోర్టర్స్, ప్రత్యక, పరోక్ష ఉద్యోగులు అందరిపైనా ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేసింది. రీటెయిల్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పనకు సరైన వాతావరణం కల్పించాలని కోరింది.
ఇవీ చూడండి:అక్కడ లీటర్ పెట్రోల్ రూ.234, డీజిల్ రూ.263
సొంత వాహనాలు పెరిగాయి... పెట్రోల్, డీజిల్ వాడకమూ పెరిగింది..