SCSS Policy Latest Updates : కేంద్ర ప్రభుత్వం తాజాగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో కీలక మార్పులు చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, వారి జీవిత భాగస్వాములకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడమే లక్ష్యంగా ఈ సవరణలు చేసినట్లు పేర్కొంది.
Key Changes In Senior Citizens Savings Scheme :కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అత్యంత ఆదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). దీనిలో చేసిన సరికొత్త మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై తమ రిటైర్‌మెంట్ ప్రయోజనాలను.. అవి అందిన 3 నెలల లోపు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో ఈ గడువు కేవలం ఒక నెల వరకు మాత్రమే ఉండేది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ నిబంధన వర్తిస్తుంది.
- సర్వీసులో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల పెట్టుబడి నిబంధనలను సైతం మరింత సరళతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా ఇకపై 50 ఏళ్ల వయస్సు దాటి సర్వీసులో ఉండగా మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములు.. తమకు అందిన ఆర్థిక పరిహారాన్ని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మదుపు చేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ తాజా నిబంధన వర్తిస్తుంది.
- కేంద్ర ప్రభుత్వం రిటైర్‌మెంట్ ప్రయోజనాల నిర్వచనం పరిధిని సైతం విస్తరించింది. ఇకపై ఉద్యోగ విరమణ వల్ల అందే ప్రతి పేమెంట్‌ను రిటైర్‌మెంట్ బెనిఫిట్‌గానే పరిగణిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొంది. భవిష్య నిధి బకాయిలు, గ్రాట్యుటీ, ఇతర పింఛన్లు, మిగిలిపోయిన సెలవులపై అందే చెల్లింపులు, ఇన్సూరెన్స్ స్కీమ్‌లకు సంబంధించిన పొదుపులు, ఎక్స్‌గ్రేషియా.. ఇలాంటివన్నీ రిటైర్‌మెంట్ ప్రయోజనాల కిందకే వస్తాయని స్పష్టం చేసింది. వీటన్నింటినీ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపింది.
- తాజాగా కేంద్ర ప్రభుత్వం SCSS నిధుల ముందస్తు ఉపసంహరణ నిబంధనలను సైతం కఠినతరం చేసింది. ఇంతకు ముందు కేవలం వడ్డీ మాత్రమే తిరిగి తీసుకొని డిపాజిట్ మొత్తాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు SCSSలో డిపాజిట్ చేసిన ఏడాదిలోపు పొదుపు సొమ్మును ఉపసంహరించుకుంటే.. మొత్తం సొమ్ముపై ఒక శాతాన్ని రుసుముగా వసూలు చేస్తారు.
- కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పొడిగింపుపై ఉన్న పరిమితిని కూడా పొడిగించింది. గతంలో కేవలం ఒకసారికి మాత్రమే ఇలా పొడిగించుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇకపై ఖాతాదారులు 3 ఏళ్లు చొప్పున, ఎన్నిసార్లు అయినా ఈ స్కీమ్‌ను పొడిగించుకునేందుకు వీలుంటుంది. అయితే ప్రతిసారి మరలా కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు విషయానికి వస్తే.. స్కీమ్ మెచ్యూరిటీ తేదీ నాటికి ఉన్న వడ్డీరేటునే డిపాజిటర్‌కు అందిస్తారు.
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరిచే సమయంలో ఎంత మొత్తం డిపాజిట్ చేస్తారో.. ఆ మొత్తాన్ని మాత్రమే కాలపరిమితి ముగిసిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. మధ్యలో అదనపు మొత్తాన్ని జమ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అంతేకాదు.. స్కీమ్‌ను పొడిగించుకునే సమయంలోనూ అదనపు మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుండదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం.. కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేసి గరిష్ఠ పరిమితి మేరకు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఒకవేళ ఖాతాదారు మరణిస్తే.. అతను/ఆమె జీవితభాగస్వామి ఈ స్కీమ్‌ను కొనసాగించవచ్చు.