స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్నడూ లేనంత త్రైమాసిక నికరలాభాన్ని అక్టోబరు-డిసెంబరులో నమోదు చేసింది. రూ.15,477 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.9,555 కోట్లతో పోలిస్తే ఇది 62% అధికం. వడ్డీ ఆదాయంలో వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగవ్వడం ఇందుకు దోహదం చేసింది. స్టాండలోన్ పద్ధతిలోనూ నికర లాభం రూ.8,432 కోట్ల నుంచి రూ.14,205 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 24.05% పెరిగి రూ.38,069 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 0.35 శాతం పెరిగి 3.5 శాతానికి చేరడం, రుణాలు 18.61 శాతం వృద్ధి చెందడం ఇందుకు తోడ్పడింది. డిపాజిట్లలో స్వల్పంగా 8 శాతం వృద్ధే ఉందని.. దీనిని పెంచుకునేందుకు చర్యలు చేపట్టామని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు. ఇతర ఆదాయం రూ.8,673 కోట్ల నుంచి రూ.11,468 కోట్లకు పెరిగింది.
SBI అదుర్స్.. రూ.15 వేల కోట్ల లాభం.. 'అదానీ'కి ఇచ్చిన రుణాలు ఎంతంటే? - sbi 62 percent growth
అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఎన్నడూ లేనంత త్రైమాసిక నికరలాభాన్ని నమోదు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రూ.15,477 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది.
ఆస్తుల నాణ్యత మెరుగు: అక్టోబరు- డిసెంబరులో ఎస్‌బీఐ ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 4.5 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబరులో ఇవి 3.52 శాతంగా ఉన్నాయి. కొత్తగా రూ.3,098 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. 2021-22 ఇదే కాలంలో మొండి బకాయిలుగా మారిన రుణాల విలువ రూ.2,334 కోట్లు. 2016 తర్వాత తొలిసారిగా ఎస్‌బీఐ మొండి బకాయిలు రూ.1 లక్ష కోట్ల దిగువకు వచ్చాయి. దీంతో మొండి బకాయిల కోసం కేటాయింపులు సగానికి తగ్గి రూ.1,586 కోట్లకు పరిమితమయ్యాయి. డిసెంబరు 31 నాటికి కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా ఉంది. ‘ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయి. మౌలిక వసతులు, రహదారులు, ఓడరేవులు, ఉక్కు, ఆతిథ్యం, పర్యాటకం, విమానయానం, వాణిజ్య స్థిరాస్తి, డేటా కేంద్రాలు, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీల రంగాల నుంచి మూలధన వ్యయాలకు సంబంధించిన రుణాల గిరాకీ పెరగొచ్చని భావిస్తున్నామ’ని ఎస్‌బీఐ ఛైర్మన్ వివరించారు.
అదానీ గ్రూప్ కంపెనీలకు రూ.27,000 కోట్ల రుణాలిచ్చినట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఈ రుణాల తిరిగి చెల్లింపు విషయంలో సమస్యలు ఎదురుకాకపోవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది.