SBI Mobile Handheld Device Service :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు బ్యాంక్ అకౌంట్లు ద్వారా.. లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాల ప్రతిఫలాలను, పెన్షన్లను అందిస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలను తప్పనిసరిగా కలిగి ఉంటున్నారు. సాధారణంగా వీరు వయోభారం చేత లేదా దివ్యాంగులు అవ్వడం మూలంగా.. బ్యాంక్‌లకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిసారీ వీరికి ఎవరో ఒకరు తోడు ఉండాల్సి ఉంటుంది. పైగా అనారోగ్య సమస్య వస్తే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 'మొబైల్ హ్యాండ్‌హెల్డ్ డివైజ్' సర్వీస్‌లను ప్రారంభించింది. దీని ద్వారా ఎస్బీఐ కస్టమర్లు తమ ఇంటి వద్దనే బ్యాంకింగ్ సౌకర్యాలు పొందడానికి వీలు అవుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు, అనారోగ్య సమస్యలతో ఇళ్లు కదలలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
"సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో లేనివారికి.. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌ను ఆవిష్కరించడం జరిగింది. దీని ద్వారా నేరుగా కస్టమర్ ఇంటివద్దకే వెళ్లి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తాం."
- దినేశ్ కుమార్ ఖారా, ఎస్బీఐ ఛైర్మన్
5 డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్
SBI Doorstep Banking Services : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ మొబైల్ హ్యాండ్‌హెల్డ్ డివైజ్ ద్వారా ఐదు కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకోవచ్చు. అవి ఏమిటంటే..
- నగదు డిపాజిట్
- నగదు ఉపసంహరణ
- నిధుల బదిలీ
- బ్యాలెన్స్ ఎక్వైరీ
- నగదు లావాదేవీల చిట్టా (మినీ స్టేట్మెంట్)
వాస్తవానికి ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద నిర్వహించే మొత్తం ఆర్థిక లావాదేవీల్లో 75% కంటే ఎక్కువగా.. పైన పేర్కొన్న బ్యాంకింగ్ సేవలే ఉంటాయి.