'ఆర్థిక పెట్టుబడులకు ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో కుటుంబానికి ఏ సమయంలోనైనా సరైన భరోసా కల్పించేందుకు బీమా పాలసీల అవసరాన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. దేశంలో డిజిటలీకరణ పెరగడంతో బీమా సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే.. ప్రజలు బీమా పాలసీల అవసరాన్ని గుర్తించి, తామే కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు' అని అంటున్నారు ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ), సీఈఓ మహేశ్ శర్మ. కొవిడ్ తర్వాత బీమా రంగ ప్రాధాన్యత, బాధ్యత మరింత పెరిగాయని చెబుతున్నారు. 'ఈనాడు' ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమంటున్నారంటే..
కొవిడ్ అనంతర ప్రపంచంలో జీవిత బీమా ప్రాముఖ్యత పెరిగిందా? పాలసీదారుల ఆలోచనలు ఎలా ఉన్నాయి?
కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల కోతలతో పాటు చాలా కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. తగిన జీవిత బీమా ఉండాల్సిన అవసరాన్ని ఇవి తెలియజేశాయి. దీంతో చాలామంది జీవిత బీమా పాలసీల ప్రయోజనాలను అర్థం చేసుకున్నారు. కొత్త సాధారణ జీవితానికి సరిపోయేలా జీవిత బీమా, ఆరోగ్య, పింఛను పరిష్కారాలను ఆర్థిక ప్రణాళికలో భాగంగా చేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా బీమా పరిశ్రమలోనూ మార్పులొచ్చాయి. వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ.. అందరికీ ఒకే బీమా అనే ధోరణిని కాకుండా.. వారికి సరిపోయే పాలసీలను ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అందరికీ బీమా పాలసీ ఉండాలన్న ఐఆర్‌డీఏఐ లక్ష్యంగా విధించుకుంది. దీన్ని ఎలా సాధించవచ్చని అనుకుంటున్నారు?
దేశంలో బీమాకు ఆదరణ ఉన్నా.. ఇతర దేశాలతో పోల్చి చూస్తే.. ఇక్కడ కేవలం 4.2% మంది మాత్రమే బీమా పరిధిలో ఉన్నారు. అందుకే, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని విధించుకుంది. ఇందుకోసం బీమా పాలసీలకు దూరంగా ఉన్నవారిని సార్వత్రిక బీమా కవరేజీ కిందకు తీసుకొచ్చేలా బీమా కంపెనీలు చర్యలు తీసుకోవాలి. బీమా అక్షరాస్యతను పెంచడం, గ్రామీణ మార్కెట్లోకి విస్తరించడం, డిజిటలైజేషన్, అందుబాటు ప్రీమియంలో పాలసీలను అందించడం.. ఇవి కీలకమైన అంశాలు. ప్రజలు జీవిత బీమా తమకు తప్పనిసరిగా అవసరం అని భావించి, తగిన పాలసీని కొనుగోలు చేయడమూ కీలకమే.