SBI Market Value : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్ విలువ తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. బ్యాంకింగ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తరవాత రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ అందుకున్న సంస్థగా ఎస్‌బీఐ నిలిచింది. బుధవారం ఇంట్రాడేలో బ్యాంక్ షేరు 3 శాతం పెరిగి రూ.574.75 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.39 శాతం లాభంతో రూ.571.60 వద్ద ముగిసింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.5.10 లక్షల కోట్లుగా నమోదైంది.
ఫలితంగా మార్కెట్ విలువ పరంగా దేశీయ అగ్రగామి 10 సంస్థల్లో 7వ స్థానంలోకి ఎస్‌బీఐ వచ్చింది. గత 3 నెలల్లో షేరు విలువ 26 శాతం దూసుకెళ్లింది. బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, భవిష్యత్‌పై సానుకూల అంచనాలు షేరు దూకుడుకు దోహదపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరకు ఎస్‌బీఐ రూ.54 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్‌ను కలిగి ఉంది.ఇదిలా ఉంటే ఎస్‌బీఐ తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ను 0.7 శాతం పెంచి 13.45 శాతానికి చేరుస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.